ఆన్ లైన్ టికెటింగ్ కి తెలంగాణ ప్ర‌భుత్వం చెక్

ఆన్ లైన్ టికెటింగ్ పేరుతో హిడెన్ దోపిడీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియ‌స్ నిర్ణ‌యం తీసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. ఆ మేర‌కు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ త్వ‌ర‌లోనే ఆన్ లైన్ టికెటింగ్ ని ర‌ద్దు చేయ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. అధికారికంగా టిక్కెట్ల అమ్మ‌కాల‌పై ప్ర‌భుత్వ‌మే ఓ ప్లాన్ ను రూపొందిస్తుంద‌ట‌. థియేట‌ర్ల‌లో 18-20 లైన్స్.. 8-10 లైన్స్ వ‌ర‌కూ సిట్టింగ్ ప్ర‌భుత్వ యంత్రాంగం చేతి నుంచే టిక్కెట్లు అమ్మేలా నిర్ణ‌యం తీసుకోనున్నార‌ట‌. ప్ర‌భుత్వమే టిక్కెట్ల అమ్మ‌కాలు చేప‌డితే నిర్మాత‌లు, బ‌య్య‌రు స‌హా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌ పంపిణీదారుల‌కు న‌ష్టాలు నివారించే వీలుంటుంద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌.

గ‌త కొంత‌కాలంగా స్థానిక అధికారులు సినీప్ర‌ముఖుల‌తో క‌లిసి తెలంగాణ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారంపై సీరియ‌స్ గా స‌మీక్ష‌లు నిర్వ‌హించింది. ఈ వ్య‌వ‌స్థ‌లో లోపాల‌పై లోతుగా అధ్య‌య‌నం చేశాక ఈ నిర్ణ‌యాన్ని వెలువ‌రించేందుకు రెడీ అవుతుండ‌డం ప్ర‌కంప‌నాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఇంత‌కీ ఈ వ్య‌వ‌స్థ‌లో అవ్య‌వ‌స్థ ఏమిటి.. లోటుపాట్లు ఏమిటి అంటే అది అధికారులు చెప్పాల్సిన ప‌ని లేదు. ఆన్ లైన్ టిక్కెటింగ్ బోగోతం ఎంత దారుణంగా ఉందో జేబులు గుల్ల చేసుకుంటున్న సామాన్యుడిని అడిగితే చెబుతారు. ఒక్కో టిక్కెట్టుపై ప్ర‌తిసారీ ఆ ఫీజు ఈ ఫీజు అంటే 40-50 అద‌నంగా బాదేస్తున్న వైనం బ‌య‌ట‌ప‌డుతూనే ఉంటుంది. ఫ్యామిలీ మొత్తానికి ఈ బాదుడు ఎంత ఉంటుందు అంచ‌నా వేయొచ్చు.

సినిమా టిక్కెట్ ధరలను ఇష్టానుసారంగా వసూలు చేయడం, ధియేటర్ లలో విక్రయిస్తున్న తినుబండారాలకు అధిక ధరలు వసూలు చేయ‌డం ఇలాంటి అరాచ‌కాల‌కు అడ్డూ ఆపూ లేదు. విస్త్ర‌తంగా పెరుగుతున్న మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్ విచ్చ‌ల‌విడి ఆదాయం కార‌ణంగా కొంద‌రు ప‌ట్టించుకోక‌పోయినా.. సామాన్యుడికి మాత్రం ముఖం వాచిపోతోంది. దీంతో సామాన్యులెవ‌రూ కుటుంబ సభ్యులతో కలసి సినిమాకు వెళ్ళలేని పరిస్తితి ఉందని ఇదివ‌ర‌కూ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ప్రైవేటు ఆన్ లైన్ వెబ్ సైట్ లు 20 నుండి 40 రూపాయల వరకు సర్వీస్ చార్జీల పేరుతో బాదుడు అరాచ‌కంగా ఉంది. ఒకొక్క ప్రదర్శనకు 50 శాతం టికెట్లు మాత్రమే ఆన్ లైన్ లో విక్రయించాల్సి ఉండగా అందుకు విరుద్దంగా అదనపు టికెట్లు విక్రయిస్తున్నారని అప్ప‌ట్లోనే మంత్రివ‌ర్యులు వివరించారు. జీ.ఎస్.టీ విధానంలో రూ.100 కంటే తక్కువ టిక్కెట్ ల పై 18 శాతం.. రూ. 100 మించి ఉంటె 28 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఆన్ లైన్ విధానంలో 1.98 శాతంతో ఎలాంటి అదనపు వసూలు ఉండదు అని ఆయన అన్నారు. అంతేకాకుండా సినిమా ధియేటర్ల‌లోని క్యాంటీన్లలో తినుబండారాల ధరలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా అలా కాకుండా ఇష్టమొచ్చిన ధరలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సినిమా ధియేటర్ నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని అప్ప‌ట్లోనే సీరియ‌స్ గా ఆదేశించినా ఈ అరాచ‌కాన్ని ప‌ట్టించుకునే నాధుడే లేడు.