ఢిల్లీ స్థాయిలో బీజేపీకీ, వైసీపీకీ ఖచ్చితమైన అవగాహన వుంది. ‘కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలుంటాయి.. కేంద్ర – రాష్ట్ర సత్సంబంధాలు మామూలే.. రాజకీయం రాజకీయమే.. రాష్ట్రానికి కేంద్రం సహాయ సహకారాలు అందించడం మామూలే..’ అని పలు సందర్భాల్లో వైసీపీ చెప్పినా, బీజేపీ చెప్పినా.. ఇది అక్షర సత్యం. అయితే, కొన్ని సందర్భాల్లో రాష్ట్రనికి కేంద్రం సహకరించడంలేదన్న విమర్శలు అధికార వైసీపీ నుంచే వినిపిస్తున్నాయి. టీడీపీతో కలిసి వున్నప్పుడు బీజేపీ, వైసీపీని అవినీతి పార్టీగా అభివర్ణించింది. బీజేపీ నేతలు కొందరు ఇప్పటికీ ఆ ఆరోపణలు చేస్తూనే వున్నారు. చంద్రబాబుపై ఇంకా గట్టిగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ పర్వంలో కొత్త ట్విస్ట్ ఏంటంటే, జగన్ సర్కారుకి చెక్ పెట్టేది మోడీ సర్కారేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. నిజానికి, సోము వీర్రాజు వ్యాఖ్యల్ని అంత తేలిగ్గా తీసుకోవడం వైసీపీకి మంచిది కాదు. ఎందుకంటే, వివిధ రాష్ట్రాల్లో రాజకీయాల్ని బీజేపీ ఎలా తన అదుపులోకి తెచ్చుకుంటోందో చూస్తున్నాం. కేంద్రంలో తనకున్నఅధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆయా రాజకీయాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది బీజేపీ. అధే ప్రక్రియ త్వరలో ఆంధ్రపదేశ్‌లోనూ జరగబోతోందని పరోక్షంగా సోము వీర్రాజు వ్యాఖ్యలని బట్టి అర్థమవుతోంది. ఏపీలో చంద్రబాబుకి బీజేపీనే చెక్ పెట్టింది. అయితే, ల్యాండ్ స్లైడ్ విక్టరీ 2019 ఎన్నికల్లో సాధించిన వైసీపీని ఢీకొనడం బీజేపీకి అంత సులువు కాదు. కానీ, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడైనా మారిపోవచ్చు. కాబట్టి, వైసీపీ.. బీజేపీ విషయంలో ఒకింత అప్రమత్తంగా వుండాల్సిందే. ‘చెక్’ పెట్టడమంటే.. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ని ఎన్నికల సమయంలో ‘గోల్డ్ స్కామ్’ పేరు చెప్పి ఇరికించడం లాంటిదేనని సోము వీర్రాజుగారి ఉవాచ అనుకోవాలేమో.