ఇటలీ లో జరిగిన వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ చిన్నారులు అదరగొట్టారు.
ఈ నెల13 నుండి 23 వరకు ఇటలీ దేశంలో వెనిస్ వేదికగా వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు.
క్రెడిట్, జూనియర్ విభాగాల్లో జరిగిన పోటీలలో ఇండియా నుంచి ఈ పోటీల్లో సుమారు 15 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇండియా కు దక్కిన 3 మెడల్స్ లో మూడు తెలంగాణ రాష్ట్రానికే రావడం గర్వకారణం.
ఈ పోటీల్లో రెండు గోల్డ్, ఒక బ్రౌంజ్ మెడల్ లను చిన్నారులు సాధించారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిన్నారులు కుమారి పెండం చందన రెండు గోల్డ్ మెడల్స్, కుమారి ఉప్పనూతల మైత్రీ ఒక బ్రాంజ్ మెడల్ తో అంతర్జాతీయ వేదికపై తమ సత్తాను చాటి చెప్పారు.
సోమవారం ఢిల్లీ, తెలంగాణ భవన్ లో కిక్ బాక్సింగ్ పోటీల విజేతలు తమ స్వీయ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
మంచిర్యాల కు చెందిన కుమారి పెండం చందన (10) మాట్లాడుతూ, మ్యూజికల్ ఫామ్ లో, మ్యూజికల్ వెపన్ ఫామ్ లో రెండు గోల్డ్ మెడల్స్ దక్కడం సంతోషంగా ఉందన్నారు. తాను చాలా టఫ్ ఫైట్ ను ఎదుర్కొన్నానని పేర్కొంటూ ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో సిల్వర్, బ్రౌంజ్ మెడల్స్ అందుకున్నానని చెప్పారు.
నేడు అంతర్జాతీయ వేదికపై జరిగిన పోటీల్లో గోల్డ్ మెడల్స్ అందుకోవడం గర్వంగా ఉందని తెలిపారు.
ఓలంపిక్స్ లో భారత్ కు గోల్డ్ మెడల్ తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యం అని వెల్లడించారు.
భారత్ తో పాటూ, తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలనన్నదే తమ ప్రధాన ధ్యేయమని కుమారి చందన తెలిపారు.
కెడిట్ మైనెస్ 47 లో పోటీ పడ్డ హైదరాబాద్ కు చెందిన కుమారి మైత్రీ (13) మాట్లాడుతూ, రష్యా, గ్రీస్, స్లోవెనియా దేశాలతో గట్టి పోటీ ఎదుర్కొన్నాననీ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీలు కాబట్టి కొంత భయానికి గురయ్యానని చెప్పారు.
ఈ పోటీలతో తనలో మరింత ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కు మంచి పేరు తేవాలన్నదే తన ఆలోచన అని అన్నారు.
ప్రభుత్వ సహకారం, కోచ్ ల ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఇటలీ లో జరిగిన పోటీల్లో పాల్గొనగలిగామని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, ఇటలీ ఛాంపియన్ షిప్ రెఫరీ రామాంజనేయులు మాట్లాడుతూ,
దేశంలోనే తెలంగాణ చిన్నారులు కిక్ బాక్సింగ్ అంతర్జాతీయ వేదకలపై తమ ప్రతిభా పాటవాలను చాటుతున్నారన్నారు.
గతంలో రష్యా వేదికగా జరిగిన పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి రెండు గోల్డ్ మెడల్స్ దక్కాయని, తాజాగా ఇటలీ లో జరిగిన పోటీల్లో సైతం గోల్డ్ మెడల్స్ దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు.
జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్ కు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుండడం సంతోషంగా ఉందని కోచ్ రామాంజనేయులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మరింతంగా సహకరిస్తే, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ తో పాటూ, భారత ఖ్యాతిని చాటవచ్చనీ చెప్పారు.
కిక్ బాక్సింగ్ కు తెలంగాణ లో మంచి ఆదరణ ఉందని, రామాంజనేయలు వెల్లడించారు.