బాబు బెయిల్‌ వెనుక పవన్… ఇటలీలో ఉండి కథ నడిపించారట!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైనా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎట్టకేలకు బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఒకానొక దశలో బాబుకు బెయిల్ వచ్చే విషయంలో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఒకదానితర్వాత ఒకటి కేసులు వెలుగులోకి వస్తుండటంతో… బెయిల్ ఆల్ మోస్ట్ కన్ ఫాం అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ తరుణంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుమారు 52 రోజులపాటు ఉన్న అనంతరం ఆయనకు మెడికల్ బ్యాక్ గ్రౌండ్ లో మధ్యంతర బెయిల్ దొరికింది.

చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేసుకోవాలని, ఈ విషయాన్ని జూలైలోనే ఎల్ వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు సూచించారని, అప్పటికే ఎడమకంటికి ఆపరేషన్ అయ్యిందని కోర్టుకు సూచించారు. ఎడకమంటికి ఆపరేషన్ అయ్యి మూడు నెలలు దాటేసిందని.. తమకు అవకాశం ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాదులు కోరడంతో మధ్యంతర బెయిల్ లభించింది. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు బాబు తిరిగి జైల్లో లొంగిపోవాలని కోర్టు సూచించింది.

ఏది ఏమైనా… కారణం మరేదైనా… కండిషన్స్ ఎలాంటివైనా… విడుదల ఎన్ని రోజులైనా… చంద్రబాబు బయటకు రావడంతో టీడీపీ శ్రేణుల సంబరాలు మత్రం అంబరాన్ని అంటాయనే చెప్పాలి. రాజమండ్రి సెంట్రల్ జైలు బయట నుంచి మొదలు తాజాగా హైదరాబాద్ లో ఇంటికి చేరేవరకూ టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసిన సంబరాలు, పలికిన ఘన స్వాగతాలు ఆకాశాన్నంటాయి. ఈ సమయంలో వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది!

ఇందులో భాగంగా… న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది, బాస్ ఈజ్ బ్యాక్, ఇప్పుడు మొదలైంది అసలైన ఆట అంటూ కామెంట్లు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఈ కామెంట్లతో సోషల్ మీడియాని హోరెత్తించేస్తున్నారు. మరోపక్క ఈ కేసు మెరిట్స్ మీద కాదు.. కేవలం ఆరోగ్య సమస్యలపైనే బాబుకు బెయిల్ వచ్చిందన్న విషయాన్ని మరిపోవద్దని, ఈ బెయిల్ కూ కేసు మెరిట్స్ కూ సంబంధం లేదని వైసీపీ గుర్తు చేస్తుంది. ఇది కూడా సంబరమే అంటూ వెటకారమాడుతుంది.

ఆ సంగతి అలా ఉంటే… చంద్రబాబు బెయిల్ విషయంలో జనసేన కార్యకర్తలు సరికొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా… చంద్రబాబుకు బెయిల్ రావడం వెనుక తమ నాయకుడి “పవర్” పని చేసిందని చెబుతున్నారు. ఇందులో భగంగా… “జగన్ ఇంగ్లాండ్‌ లో ఉండి చంద్రబాబును అరెస్ట్ చేయిస్తే… పవన్ ఇటలీలో ఉండి బెయిల్ ఇప్పించాడు. దెబ్బకు దెబ్బ” అని సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు జనసేన అభిమానులు! ఫలితంగా వైసీపీ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో… ఇది కొత్త చర్చకు దారితీసింది!