తెలంగాణలో ఏర్పడిన జెఏసీల కల్చర్ ఇప్పుడు తిరుమల కొండకు పాకింది. తెలంగాణ ఉద్యమకాలంలో జెఏసీలను ఏర్పరుచుకొని తెలంగాణ ప్రజలు పోరాడారు. ఇప్పుడు అదే విధానాన్ని తిరుమల ఉద్యోగులు ఎంచుకున్నారు. తిరుపతి చరిత్రలోనే తొలిసారి సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల జేఏసీ ఏర్పడింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టిటిడి ఉద్యోగులు గురువారం ఈవో అనిల్ సింఘాల్ కు సమ్మె నోటీసులు ఇచ్చారు. కాంట్రాక్టు కార్మికులు కూడా సమ్మె నోటీసులిచ్చేందుకు సిద్దమవుతున్నారు. తమ సమస్యల పరిష్కారానికి ఆగష్టు 16 వరకు వారు ఈవోకి డెడ్ లైన్ పెట్టారు. తిరుపతిలో పర్మినెంట్ ఉద్యోగులు 8200 మంది, కాంట్రాక్టు ఉద్యోగులుగా 14,500మంది పని చేస్తున్నారు. పనిభారం పెరుగుతుందని, అన్ని సౌకర్యాలు కల్పించాలని 2005 నుంచి ఇప్పటి వరకు దాదాపు 52 సార్లు వారు ఉద్యమించారు. గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి సమయంలో వైకుంఠం ద్వారా ఉద్యోగులకు స్వామి వారి దర్శనం కల్పించనప్పటి నుంచి వివాదాలు మొదలయ్యాయి. సర్వీసు రూల్స్, డిమాండ్లను ఉద్యోగులను సమ్మె నోటిసులో పేర్కొన్నారు. అయితే జేఏసీగా ఏర్పడి నోటిసు ఇవ్వటంతో అంతా చర్చగా మారింది. ఎందుకంటే తెలంగాణలో మొదలైన జేఏసీల విధానం ఇప్పుడు ఆంధ్రాకు కూడా పాకింది.
తెలంగాణ ఉద్యమం సమయంలో ఓయూ విద్యార్థి నేత డి.రాజారాం యాదవ్ విద్యార్థి జేఏసీని మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేశారు. అన్ని విద్యార్థి సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి ఐక్యకార్యాచరణ సమితిని రాజారాం యాదవ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాతనే తెలంగాణ జేఏసీ ఏర్పాడింది. ఉద్యమం తీవ్రం కావడంతో ఉద్యోగ సంఘాల జేఏసీలు, కార్మిక సంఘాల జేఏసీలుగా ఏర్పడి పోరాడాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా విద్యార్థి జేఏసీలు, ఉద్యోగుల జేఏసీలు, కార్మికుల జేఏసీలు ఏర్పడ్డాయి. జేఏసీల ద్వారా ఆంధ్రా ప్రజలు, నాయకులు ఉద్యమించారు. జెఏసీ అంటే కేవలం కోదండరాం అనే విధంగా తెలంగాణ జేఏసీకి పేరొచ్చింది. కోదండరాం ఈ మధ్య రాజకీయ పార్టీ స్థాపించడంతో టిజెఏసీకి రఘు చైర్మన్ గా అయ్యారు. కోదండరాం జేఏసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి జెఏసీ అంత బలంగా లేదు. ఇటువంటి సమయంలో టిటిడిలో మాత్రం కొత్తగా ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పడి ఈవోకి సమ్మె నోటీసులిచ్చారు. తెలంగాణలో ఏర్పడిన జేఏసీల కల్చర్ ఆంధ్రాకు కూడా పాకిందనే చర్చ ప్రజలలో జరుగుతోంది. ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు ఇవ్వడంతో ప్రభుత్వంలో, దేవాలయ అధికారుల్లో భయం ఏర్పడిందో ఏమో కార్మికులు ఆగష్టు 16 వరకు డెడ్ లైన్ పెట్టినా శుక్రవారం మధ్యాహ్నమే సమావేశమవుదామని ఈవో జేఏసీ నేతలకు తెలిపారట. జేఏసీ దెబ్బకు ఉన్నతాధికారుల్లో భయం పుట్టుకుందని ఆలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.