తెలంగాణలో ఆ కేటగిరీ జనాల లెక్కలు తీయండి… జల్దీ

టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ అమలుపై కసరత్తు వేగవంతం చేసింది. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శైలేంద్రకుమార్ జోషి ఈ విషయమై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష జరిపారు. పూర్తి వివరాలు చదవండి.

నవంబరు 19 న ప్రచురించిన ఓటరు జాబితాల నుండి గ్రామాల వారిగా 57 నుండి 64 వరకు వయస్సు గల వారి వివరాలను 3 రోజుల్లో కమీషనర్ ఈ సేవ కు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి ఆదేశించారు. గురువారం సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో 57 సం.లు నిండిన వారికి ఆసరా ఫించన్ల మంజూరు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పంచాయతీ ఎన్నికలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం, జాతీయ రహదారులు, రైల్వేల భూసేకరణ, అటవీ భూముల సర్వేలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, పిసిసిఎఫ్ పి.కె.ఝా, పంచాయతీ రాజ్ కమీషనర్ నీతూప్రసాద్, సిసిఎల్ఎ డైరెక్టర్ కరుణ, సెర్ప్ సిఇఓ పౌసమిబసు, ఈ సేవ కమీషనర్ వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

57 సంవత్సరాలు నిండిన వారికి వచ్చే ఏప్రిల్ నుండి నూతనంగా ఫించన్ల మంజూరుకు సంబంధించి ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేకంగా ఆదేశాలు జారీచేశారని, కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధతో కార్యచరణను చేపట్టాలన్నారు. ఈ విషయమై వివిధ జిల్లాల కలెక్టర్లు చేపడుతున్న చర్యలను సమీక్షించారు. 57 సం.లు నిండిన అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. డ్రాప్టు జాబితాను గ్రామ సభలలో పెట్టి ఫిర్యాదులను స్వీకరించాలన్నారు. జిల్లాకు ఎంతమంది అర్హులు అవుతారో తెలపాలన్నారు. 

స్వచ్ఛభారత్ గ్రామీణకు సంబంధించి సి.యస్ సమీక్షిస్తూ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. పంచాయతీరాజ్ కమీషనర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం జిల్లాలకు మంజూరు చేసిన నిధుల నుండి పూర్తి చేసిన లబ్ధిదారులకు వెంటనే విడుదల చేయాలన్నారు ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన స్వచ్ఛ సర్వేక్షణ్ టీములు జిల్లాలో పర్యటించనున్నారని గ్రామపంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు వచ్చే అవకాశం ఉందని అంగన్ వాడి, పాఠశాల టాయిలేట్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. టాయిలేట్ల నిర్మాణాలను వెంటనే అప్ లోడ్ చేయాలన్నారు. 

గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచులు, వార్డుసభ్యుల వారిగా ఎస్.సి, ఎస్.టి, బిసి ల రిజర్వేషన్ లకు సంబంధించి మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్లకు పంపామని ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. నిర్ధేశించిన సమయంలోగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. 

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి సి.యస్ మాట్లాడుతూ క్రీడలు, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకు సంబంధించి ప్రత్యేకంగా పరిశీలించాలన్నారు. నీతుప్రసాద్ మాట్లాడుతూ ఎంపికైన ప్రతి అభ్యర్ధి, మార్కులు, ర్యాంకు, క్యాటగిరిలను ప్రకటించాలన్నారు. జాతీయ రహదారులు, రైల్వే భూసేకరణకు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, జిల్లా కలెక్టర్లు గడువులోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సి.యస్ అన్నారు. 

రహదారులు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ మాట్లాడుతూ ఎన్ హెచ్ఆర్ఐ (NHAI) కి సంబంధించి ఖమ్మం, మహబూబ్ నగర్, జగిత్యాల, సూర్యాపేట, కరీంనగర్, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు జనవరి, ఫిబ్రవరి 2019 లోగా భూసేకరణను పూర్తిచేయాలని అన్నారు. 

భద్రాచలం-సత్తుపల్లి రైల్వేలైనుకు సంబంధించి, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సి.యస్ అన్నారు.
అటవీ భూముల సర్వేకు సంబంధించి జిల్లాలకు సర్వేయర్లతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం లను పంపుతున్నామని ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు.
అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా మాట్లాడుతూ దాదాపు 22 లక్షల ఎకరాల అటవీభూములను రీకౌన్సిల్ (Reconcile) చేయవలసి ఉందని, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్, కొమురంభీం ఆసిఫాబాద్, మహబూబబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎక్కువ అటవీ విస్తీర్ణం ఉందన్నారు. ఇప్పటికే గుర్తించిన అటవీ భూములలో వివిధ పేర్లతో విభజన (Classify) చేశారని, వాటిని రెవెన్యూ రికార్డులలో అడవిగా నమోదుచేయాలన్నారు.

రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి మాట్లాడుతూ అటవీ భూముల సర్వేకు సంబంధించి రెవెన్యూశాఖ ద్వారా ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసిందని తెలిపారు. 212 మంది నూతన సర్వేయర్లు శిక్షణలో ఉన్నారని, వీరందరు జనవరి మొదటి వారంలోగా అందుబాటులోకి వస్తారని తెలిపారు.ఇప్పటికే పనిచేస్తున్న సర్వేయర్లతో పాటు నూతన సర్వేయర్లతో కూడిన టీంలను ప్రత్యేక టీం లుగా ఏర్పాటుచేసి జిల్లాలకు పంపుతామన్నారు. ఈ సర్వేలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.