దశాబ్దాల కాలంగా బిసి ఉద్యమాన్ని భుజాన వేసుకుని మోసిన నాయకుడు ఆర్. కృష్ణయ్య. బిసి అనే పేరు వినగానే దానికి కంటిన్యేషన్ గా ఆర్. కృష్ణయ్య పేరు వినిపిస్తది. బిసి నినాదాన్ని ఆయన తన శక్తి మేరకు జనాల్లోకి తీసుకెళ్లారు. బిసి సంఘం నేతగా ఉన్న ఆయన 2014లో టిడిపి అభ్యర్థిగా ఎల్ బి నగర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆర్.కృష్ణయ్య అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు ఆయన కొత్త రాజకీయం మొదలు పెట్టబోతున్నారు. వివరాలు చదవండి.
అయితే ఆర్. కృష్ణయ్య గడిచిన నాలుగున్నరేళ్లలో టిడిపితో అంటీముట్టనట్లుగానే ఉన్నారు. గత ఎన్నికల్లో ఆర్.కృష్ణయ్యను సిఎం అభ్యర్థిగా టిడిపి అనౌన్స్ చేసింది. కానీ టిడిపి శాసనసభాపక్ష నేతగా మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కారణాలేమైనా ఆయనను పక్కనపెట్టి ఎర్రబెల్లి దయాకర్ రావుకు టిడిఎల్ పీ నేత చాన్స్ ఇచ్చింది.
కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు బంగారు తెలంగాణ సాధించేందుకు టిఆర్ఎస్ లో చేరారు. అంతేకాకుండా టిడిఎల్పీ మొత్తాన్ని టిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు లెటర్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో 2014 ఎన్నికల తర్వాత బంగారు తెలంగాణ బ్యాచ్ పోగా మిగిలిన ఎమ్మెల్యేలు ఇద్దరే. ఒకరు సండ్ర వెంకట వీరయ్య, ఇంకొకరు అంటీముట్టనట్లు ఉన్న ఆర్. కృష్ణయ్య.
ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు ఆర్.కృష్ణయ్య రెడీ అవుతున్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది. శనివారం ఉదయం ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీని కలిసి ఆయన సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్.కృష్ణయ్యతోపాటు మాజీ పిసిసి అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. వీరిద్దరితోపాటు గజ్వేల్ లో టిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన తూంకుంట నర్సారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో రేపు రాహుల్ గాంధీ సమక్షంలో జాయిన్ కానున్నట్ల కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
కృష్ణయ్య తన జీవితమంతా బిసి ఉద్యమానికే అంకితం చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మొదలుకొని అనేకసార్లు ఆర్.కృష్ణయ్యను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆర్.కృష్ణయ్య జాయిన్ కాలేదు. చివరకు 2014 ఎన్నికల ముందు టిడిపి కండువా కప్పుకున్నారు. కానీ టిడిపి ఆయనను పెద్దగా గౌరవించిన దాఖలాలు లేవు. అలాగని ఆయన కూడా ఆపార్టీ మీద దుమ్మెత్తి పోెయలేదు. నీ అవసరం నాకు, నా అవసరం ీనీకు అన్నట్లు రెండు పార్టీలు వ్యవహరించాయి. దీంతో ఈసారి ఎన్నికల్లో ఆర్.కృష్ణయ్య మహా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయబోతున్నారు.
బిసిలకు రాజ్యాధికారం కావాలన్నది ఆర్ కృష్ణయ్య లక్ష్యం. ఆ దిశగా ఆయన బిసిల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తూ వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో బిసి విద్యార్థులకు కూడా సంక్షేమ హాస్టళ్లు కావాలని కొట్లాడి మరీ పెట్టించింది ఆయనే. బిసి విద్యార్థులకు స్కాలర్ షిప్స్, మెస్ ఛార్జీల పెంపు కోసం అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. అయితే కృష్ణయ్య పలు సందర్భాల్లో బిసి రాజకీయ పార్టీ పెట్టాలన్న ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ ఆచరణరూపం దాల్చలేదు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బిసిలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం సీట్లు కేటాయించాలని కృష్ణయ్య డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా బిసిలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల బిల్లు కోసం పోరాడుతున్నారు.
అయితే ఆర్.కృష్ణయ్య పలు సందర్భాల్లో వివాదాల్లోనూ చిక్కుకున్నారు. వివాదాలన్నింటిలోనూ అత్యంత ప్రమాదకరమైనదేమంటే నరహంతక నయీంతో ఆయన సంబంధాలు కొనసాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. నయీం అనే వ్యక్తి ఎక్కువ మంది బిసిలనే టార్గెట్ చేసి చంపిన దాఖలాలున్నాయి. అలాంటి వ్యక్తితో ఆర్.కృష్ణయ్య సత్సంబంధాలు కలిగి ఉండడం అప్పట్లో ఆయన మీద దుమరాం రేగింది. అయితే ఆ తర్వాత తెలంగాణ సర్కారు నయీం కేసును ఉద్దేశపూర్వకంగా నీరుగార్చిందన్న విమర్శలున్నాయి. దీంతో నయీం కేసు గప్ చుప్ అయింది. నయీంతో సంబంధాలున్నవారంతా రిలాక్స్ అయిపోయారు.
మొత్తానికి ఆర్ కృష్ణయ్య రేపటి నుంచి కొత్త పొలిటికల్ జెర్నీ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆర్.కృష్ణయ్య మహా కూటమిలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. ఆర్ కృష్ణయ్య ఎక్కడి నుంచి పోటీ అనే అంశంపై మరో స్టోరీలో వివరాలు తెలుసుకుందాం.