Teenmaar Mallanna: బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం.. కొత్త పార్టీ ప్రకటించిన తీన్మార్ మల్లన్న

Teenmaar Mallanna

తెలంగాణలో మరో పార్టీ పురుడు పోసుకుంది. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. ఈ పార్టీకి ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ అనే పేరు ఖరారు చేశారు. పార్టీ జెండాలో రెండు రంగులు ముద్రించారు. జెండా పైభాగంలో ఎరుపు రంగు, కింది భాగంలో ఆకుపచ్చ రంగును ఏర్పాటుచేశారు. జెండా మధ్యలో కార్మికులకు గుర్తుగా కార్మిక చక్రం, ఆ చక్రం నుంచి పిడికిలి బిగించిన చేతిని చిహ్నంగా ముద్రించారు.

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. తన పార్టీకి ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించి ప్రజల ముందుకు తెచ్చారు. ఇక ఈ చిహ్నానికి రెండు వైపులా ఆలీవ్ ఆకులు ఉన్నాయి. జెండాపై ఆత్మగౌరవం- అధికారం- వాటా అనే నినాదం రాశారు.

బీసీలకు రాజ్యాధికారం సాధించడమే తమ లక్ష్యమని మల్లన్న స్పష్టం చేశారు. బీసీల రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం పోరాడటమే లక్ష్యంగా తాను పార్టీ పెట్టినట్లు వెల్లడించారు. తెలంగాణ గడ్డపై మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీలను ఏకం చేసి రాజ్యాధికారం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మల్లన్న బీసీల నినాదంతో ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త పార్టీ పెట్టారు.

కాగా తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో ప్రసారమైన తీన్మార్ షో ద్వారా పాపులర్ అయి తీన్మార్ మల్లన్నగా పేరు తెచ్చుకున్నారు. అనంతరం రాజకీయాల మీద ఆసక్తితో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2021లో బీజేపీలో చేరారు. అయితే 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పార్టీలో ఉండగానే కులగణన జీవోపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడుతున్నారు. తాజాగా కొత్త పార్టీ పెట్టారు.