మహా కూటమిపై టిడిపి రమణ సంచలన కామెంట్స్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై తెలంగాణ టిడిపి అధినేత ఎల్ రమణ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తెలంగాణలో దొరల పాలన అంతం చేయడానికి, కుటుంబ పాలనుకు చెరమగీతం పాడడానికి మహా కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రమణ స్పష్టం చేశారు. ఆయన ఒక టివి ఛానెల్ కు  ఇంటర్వ్యూ ఇస్తూ సంచలన కామెంట్స్ చేశారు. మహా కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైతే ఎంతటి త్యాగాలకైనా సిద్ధమే అని ప్రకటించారు. 

ఎల్. రమణ జగిత్యాల నియోజకవర్గానికి సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన గత 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. జగిత్యాల సిట్టింగ్ సీటు కాంగ్రెస్ పార్టీది. ఆ పార్టీ నుంచి జీవన్ రెడ్డి 2014 లో ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటు కాబట్టి జగిత్యాలలో జీవన్ రెడ్డి పోటీ చేసే చాన్స్ ఉందని తెలుస్తోంది. మరి అదే పరిస్థితి ఉత్పన్నమైతే ఎల్ రమణ పక్క నియోజకవర్గమైన కోరుట్లలో పోటీ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కోరుట్లలో తాజా మాజీ టిఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యాసాగర్ రావు ఉన్నారు. ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని టిడిపి అంచనాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఎల్ రమణ కుదిరితే జగిత్యాలలో పోటీ చేయవచ్చు. లేదంటే కోరుట్లలో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గులాబీ పార్టీని ఇంటికి పంపేందుకు టిడిపి కసితో ఉన్నట్లు రమణ మాటలను బట్టి తెలుస్తోంది.

కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు అవసరమైతే తన సీటు త్యాగం చేయడానికి కూడా రెడీ అని రమణ ప్రకటించడం టిడిపి వర్గాల్లో జోష్ నింపుతున్నది. పార్టీ అధినేత కాబట్టి ఆయన సీటు త్యాగం చేస్తా అని చెప్పినా ఏదో ఒక సీటులో ఆయనను పోటీ చేయించడం ఖాయం అని చెబుతున్నారు. 

తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి ఇప్పటికే ఖరారైంది. కూటమిలో పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉండనుంది. ఇక టిడిపి, సిపిఐ కూటమిలో చేరిపోయాయి. అయితే తెలంగాణ జన సమితి కూటమి వైపే అడుగులేస్తున్నప్పటికీ ఇంకా అధికారికంగా కూటమిలో చేరుతున్నట్లు ప్రకటన చేయలేదు. 

ఈ నేపథ్యంలో టిడిపి కూటమిలో కోరే సీట్ల జాబితా ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు చెక్కర్లు కొడుతున్నది. అందులో టిడిపి సీనియర్ లీడర్లందరినీ అకామిడేట్ చేసేలా మహా కూటమి కూర్పు ఉండాలని టిడిపి కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే టిడిపి కోరినన్ని సీట్లు కాంగ్రెస్ ఇస్తుందా లేక మరికొన్ని సీట్లలో కోత విధిస్తుందా అన్నది చూడాలి.

టిడిపి  సీట్లు, జాబితా ఇదే :

వైరల్ గా మారిన జాబితా కింద ఉంది చూడండి.

మహాకూటమిలో టిడిపి పోటీ చేయాలనుకుంటున్న స్థానాలు, అభ్యర్థులు!!

దేవరకద్ర – రావుల చంద్రశేఖర్‌రెడ్డి

మక్తల్ – కొత్తకోట దయాకర్‌‌రెడ్డి 

మహబూబ్‌నగర్- చంద్రశేఖర్ (ఎర్ర శేఖర్ )

రాజేంద్రనగర్-ఎమ్ భూపాల్‌రెడ్డి

శేరిలింగంపల్లి -మండవ వెంకటేశ్వరరావు, లేదా మొవ్వ సత్యనారాయణ

కూకట్‌పల్లి- శ్రీనివాసరావు 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ – ఎం.ఎన్.శ్రీనివాసరావు

సికింద్రాబాద్ – కూన వెంకటేష్‌గౌడ్.

ఉప్పల్- వీరేందర్‌గౌడ్. 

ఖైరతాబాద్ -బి.ఎన్.రెడ్డి, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు

జూబ్లిహిల్స్ – ఉప్పలపాటి అనూష రామ్

కోరుట్ల-ఎల్ .రమణ 

హుజూరాబాద్ – ఇనగాల పెద్దిరెడ్డి  

ఆర్మూర్ – ఏలేటి అన్నపూర్ణ

పరకాల లేదా వరంగల్ వెస్ట్ – రేవూరి ప్రకాష్‌రెడ్డి

ఆలేరు – శోభారాణి 

కోదాడ – బొల్లం మల్లయ్యయాదవ్

మిర్యాలగూడ -శ్రీనివాస్ (వ్యాపార వేత్త)

ఖమ్మం – నామా నాగేశ్వరరావు

సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య

ఈ సీట్లలో పెద్ద లీడర్లుగా ఉన్న వారందరికీ సీట్లు కావాలని టిడిపి పట్టుపట్టే చాన్స్ ఉంది. అయితే కొన్ని సీట్లు తగ్గించే పరిస్థితి వస్తే ఇందులో ఎవరిని తీసేస్తారు? అన్నది చూడాల్సి ఉంది.