జనసేన పార్టీ తెలంగాణలో 8 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది.! ఇది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో మాత్రం జనసేన వర్సెస్ టీడీపీ.. రెండు పార్టీల మధ్య రచ్చ ఓ రేంజ్‌లో నడుస్తోంది.!
పై స్థాయిలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్.. తాము కలిసే వున్నామని చెబుతున్నారు. ‘పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి’ అని ఏపీలో నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా నినదించారు కూడా.
అయితే, టీడీపీ క్యాడర్ వ్యవహారం వేరేలా వుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ టీడీపీ క్యాడర్ మద్దతిస్తోంది. బీఆర్ఎస్ మీదా, బీజేపీ, జనసేన మీదా మంటెక్కిపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ. ఇదో చిత్రమైన సందర్భం.
జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్టుంది వ్యవహారం. తెలంగాణలో టీడీపీ గల్లంతయిపోయిన పార్టీ. జనసేన మాత్రం బీజేపీతో పొత్తు కారణంగా కొంత సందడి చేస్తోంది. డిపాజిట్లు అయినా జనసేనకు దక్కుతాయా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కూకట్‌పల్లి నియోజకవర్గంలో అయితే జనసేన కొంచెం గట్టిగానే సందడి చేస్తున్నమాట వాస్తవం.
తెలంగాణలో జనసేనకు మద్దతుగా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన కూడా ఇప్పించలేకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. అయితే, జనసేనాని రోడ్ షోలలో కొన్ని టీడీపీ జెండాలు అయితే కనిపించాయి. కానీ, సోషల్ మీడియాలో కనిపిస్తున్న వ్యతిరేకత చూస్తోంటే, జనసేనకు టీడీపీ నుంచి ఒక్క ఓటు కూడా పడేలా కనిపించడంలేదు.
గెలుపోటముల సంగతెలా వున్నా.. టీడీపీ కార్యకర్తల యాగీ నేపథ్యంలో జనసేన నవ్వుల పాలవుతోంటే, అసలు పోటీ చేయని టీడీపీకి తెలంగాణ రాజకీయాలతో ఏం పని.? అంటూ తమ మీద పడుతున్న సెటర్లతో టీడీపీ విలవిల్లాడుతోంది.
ఈ కామెడీని, తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎంజాయ్ చేస్తున్నాయి.