గత అసెంబ్లీ ఎన్నికల నుంచి తెలంగాణలో రోజురోజుకూ పట్టు కోల్పోతున్న టీడీపీ… ఈ సారి తెలంగాణలో ఎలాగైనా తన ఉనికి కాపాడుకోవాలని ప్రయత్నాలు ఆరంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే కాసాని జ్ఞానేశ్వర్ కి పార్టీ బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు.. కొత్త ప్రయత్నాలు ప్రారంభించారు.
అవును… తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టి.టీడీపీ బస్సు యాత్రకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 23వ తేదీన యాత్ర ప్రారంభించి, హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ లో జోష్ నింపాలని చూస్తోంది.
టీ.టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్ ఛార్జులతో సమావేశమై ఇప్పటికే బస్సు యాత్రపై చర్చించారు. అనంతరం స్పందించిన ఆయన… యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధమైందని చెప్పారు. ఇందులో భాగంగా… జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని.. దీన్ని అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభిస్తారని జ్ఞానేశ్వర్ ప్రకటించారు.
ఇదే సమయంలో… గ్రేటర్ లో టీ-టీడీపీకి ఓటు బ్యాంక్ ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తోన్న కాసాని జ్ఞానేశ్వర్.. బస్సు యాత్ర సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసిన నాయకులు.. పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం వస్తుందని చెప్పడం గమనార్హం.
అయితే తెలంగాణ మొత్తంలో ఈ యాత్ర ఉండే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఫలితంగా… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు లోక్ సభ స్థానాల్లో మాత్రమే ఈ యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పార్టీకి కాస్తో కూస్తో పట్టు మిగిలిందంటే అది హైదరాబాద్ లోనే అని టీడీపీ అంచనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆ సంగతి అలా ఉంటే… నాలుగురోజల క్రితం ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో భాగంగా.. ఏపీలో ఎక్కడ చూసినా ఫ్యాక్టరీలు తరలిపోతోన్న వార్తలు వినిపిస్తుంటే… తెలంగాణలో అభివృద్ది చెందుతున్నట్లు కనిపిస్తుందని కంపేర్ చేశారు.
దీంతో… తెలంగాణలో ప్రభుత్వ పాలన బాగుందని తెలిసినప్పుడు ఇంకా యాత్రలు ఎందుకనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా.. జీ.హెహెచ్.ఎం.సీ ఎన్నికల్లోనూ సైకిల్ కు గట్టిగానే పంచర్ పడిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క కార్పొరేటర్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరవ్యాప్తంగా చేసే యాత్రకు వచ్చే స్పందనను బట్టి తెలంగాణలో ఎలా ముందుకెళ్లాలనేదానిపై టీ-టీడీపీ ఓ అంచనాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.