పాఠశాలలో భోజనం సరిగ్గా లేదని హైకోర్టు న్యాయమూర్తికి విద్యార్ధుల లేఖ

తమ పాఠశాలలో భోజనం సరిగా పెట్టడం లేదని నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల ప్రాథమిక పాఠశాల విద్యార్దులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అక్టోబర్ 1 వ తేదిన లేఖ పై న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ స్పందించారు. అక్కడి సమస్యలను వెంటనే తెలుసుకోవాలని ఆయన స్టేట్ లీగల్ అథారిటికి ఆదేశాలిచ్చారు.

దీని పై వెంటనే విచారణ జరిపించాలని లీగల్ అథారిటి నుంచి విద్యాశాఖకు ఆదేశిలిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా డిఈవో సహదేవుడు కొండనాగుల ప్రాథమిక పాఠశాలను శుక్రవారం సందర్శించారు. పాఠశాలను తనిఖీ చేసి విద్యార్దుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. పాఠశాలలోని మద్యాహ్న భోజనం,రికార్డులను పరిశీలించారు. 

 

భోజనం సరిగా లేదని విద్యార్దులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. బడిలో ఉన్న సమస్యలపై విద్యార్దులు డిఈవోకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. టిచర్లు తమను కొడుతున్నారని, క్లాసులు కూడా సరిగా కావని చెప్పారు.

పాఠశాల విద్యార్దుల పరిస్థితి చూసి చలించిన డిఈవో ప్రధానోపాధ్యాయుడు, టిచర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు రామకోటి, టిచర్లు శ్యాం సుందర్ రెడ్డి, హనుమంతులను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీని కూడా వెంటనే మార్చాలని ఎంఈవోకి ఆదేశాలిచ్చారు. పిల్లల ఫిర్యాదును డిఈవోకి పంపుతామన్నారు.

పాఠశాలలో మధ్యాహ్నా భోజనాన్ని పరిశీలిస్తున్న అధికారులు

విద్యార్దుల ఫిర్యాదుతో హైకోర్టు న్యాయమూర్తి, డిఈవో వెంటనే స్పందించి చర్య తీసుకోవడంతో విద్యార్దులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక పాఠశాలలో ఇలాంటి సమస్యలున్నాయని కొండనాగుల చర్యలతోనైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులలో మార్పు రావాలని విద్యార్ధి సంఘాల నాయకులు కోరుతున్నారు. సమస్యలున్నాయని ఆగకుండా ధైర్యంతో హైకోర్టుకు లేఖ రాసిన విద్యార్దులను అంతా అభినందించారు.