తెలంగాణ రాష్ట్రంలో నెలరోజుల క్రితమే బడులు ఓపెన్ కాగా ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు పుస్తకాలు అందలేదని సమాచారం. పుస్తకాలు లేకపోవడంతో పలు ప్రభుత్వ పాఠశాలలలో ఇప్పటివరకు ఒక్క పాఠం కూడా చెప్పలేదని బోగట్టా. విద్యాశాఖ క్యాలండర్ కు అనుగుణంగా టీచర్లు క్లాసులు చెప్పకపోవడంతో విద్యార్థుల కెరీర్ పై ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి.
విద్యార్థులకు పుస్తకాలు అందాలంటే మరింత సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 24,852 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా లక్షల సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటున్నారు. ఈ సంవత్సరం నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ లో బోధన జరగనుంది. ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడంతో గతేడాదితో పోల్చి చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందని సమాచారం అందుతోంది.
విద్యాశాఖ పుస్తకాల ముద్రణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పుస్తకాలు లేకుండానే విద్యార్థులు క్లాసులకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ముద్రించిన పుస్తకాలు మండల కేంద్రాలలో ఉన్నాయని సమాచారం. మరోవైపు రాష్ట్రంలో 16,000 మంది ఉపాధ్యాయుల కొరత అయితే ఉందని తెలుస్తోంది. మూసారాంబాగ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నాగబాబు అనే విద్యార్థి స్కూల్ మొదలై చాలారోజులైనా పుస్తకాలు ఇవ్వలేదని మేథ్స్ టీచర్ సెలవులో ఉన్నారని చెప్పారు.
సైన్స్ టీచర్ చేత మేథ్స్ చెప్పాస్తారని అంటున్నారని ఆ విద్యార్థి తెలిపారు. త్వరగా పాఠాలు చెబితే బాగుంటుందని ఇంగ్లీష్ మీడియం కావడంతో కొంత కంగారు ఉందని నాగబాబు తెలిపారు. పేపర్ సకాలంలో అందకపోవడం వల్ల ముద్రణ ఆలస్యమైందని ఆగష్టు మొదటి వారంలోపు విద్యార్థులందరికీ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణ విభాగం డైరెక్టర్ శ్రీనివాసాచారి తెలిపారు. తెలంగాణ సర్కార్ విద్యార్థుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సి ఉంది.
