తెలంగాణలో షర్మిల రాజకీయం.! ఏపీలో వైఎస్ జగన్‌కి నష్టం.!

ప్రతి విషయంలోనూ ఏపీ వర్సెస్ తెలంగాణ అనే పోలిక వస్తోంది.. అదీ షర్మిల తెలంగాణలో రాజకీయం చేయడం కారణంగా మరింత తలనొప్పిగా మారుతోంది.! తెలంగాణ కోసం అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌తోనూ కొట్లాడతాను.. అనే స్థాయికి తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ ఉపన్యాసాలు దంచెయ్యడం చూస్తున్నాం. ‘వైఎస్ జగన్ రాజన్న రాజ్యం తెస్తానన్నారు.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. వైఎస్ షర్మిల కూడా రాజన్న్ రాజ్యం తెస్తానంటున్నారు.. అంటే, తెలంగాణకి రాజధాని లేకుండా చేస్తారేమో..’ అన్న సంకేతాలు తెలంగాణకి వెళుతున్నాయి.

నిరుద్యోగ సమస్య సహా ఏ అంశం గురించి వైఎస్ షర్మిల తెలంగాణలో మాట్లాడుతున్నా, ఏపీలో మీ అన్న చేస్తున్నదేంటి.? అన్న ప్రశ్న నేరుగా వైఎస్ షర్మిలకే వెళుతోంది. అంతే కాదు, ‘మీ చెల్లి నిన్నే విమర్శిస్తోంది జగన్ రెడ్డీ..’ అంటూ విపక్షాలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎత్తి చూపిస్తున్నాయి. ‘అక్క చెల్లెమ్మలందరికీ అండగా వుంటా..’ అని వైఎస్ జగన్ చెబుతోంటే, ‘మీ మాతృమూర్తి విజయలక్ష్మి ఏపీని వదిలి తెలంగాణకు ఎందుకు పారిపోయారు.? మీ చెల్లెల్ని ఎందుకు తెలంగాణకి తరిమేశారు.?’ అన్న విమర్శలు వైఎస్ జగన్ మీద వస్తుండడం గమనార్హం.

తెలంగాణ వేరు, ఏపీ వేరు.. రెండూ వేర్వేరు రాష్ట్రాలు గనుక, తెలంగాణలో షర్మిల రాజకీయం చేస్తే దాన్ని తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ, గతంలో వైసీపీ కోసం షర్మిల, విజయలక్ష్మి పనిచేశారు.. వైసీపీకి ఓట్లెయ్యమని జనాన్ని కోరారు. ఆ ప్రజల తరఫున మాట్లాడకుండా, తెలంగాణకు చెక్కేయడమేంటి.? అన్న ప్రశ్న సహజంగానే వైఎస్సార్ కుటుంబ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.