సరస్వతి పూజకు ముందు రేగు పండు తినకూడదని, అలా తింటే చదువు పట్టదని పెద్దలు చెప్పిన మాటలు చాలామంది చిన్ననాటి నుంచి వింటూనే ఉంటారు. వసంత పంచమి వచ్చిందంటే పుస్తకాలతో పాటు రేగు పండు తప్పనిసరిగా పూజ గదిలో కనిపిస్తుంది. కానీ ఈ చిన్న పండుకు విద్యాదేవత సరస్వతికి మధ్య అసలు సంబంధం ఏమిటి? ఎందుకు దేవికి ముందుగా నైవేద్యం చేయకుండా రేగు తినరాదు.. ఈ ప్రశ్నలకు సమాధానం ఒక పురాణ గాథలో దాగి ఉంది.
విద్య, జ్ఞానం, వాక్కు అధిష్ఠాత్రి అయిన సరస్వతి దేవిని మాఘ శుక్ల పంచమి రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ పూజలో పసుపు రంగు వస్త్రాలు, పుస్తకాలు, వాద్యాలతో పాటు రేగు పండు కూడా ముఖ్యమైన స్థానం పొందింది. దేవికి నైవేద్యం సమర్పించేవరకు రేగును తినకూడదన్న ఆచారం ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కచ్చితంగా పాటిస్తున్నారు.
పురాణాల ప్రకారం, మహర్షి వ్యాసదేవుడు వేదజ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించాలనే సంకల్పంతో బద్రీకాష్రమంలో ఘోర తపస్సు చేపట్టాడు. విద్యా ప్రసాదిని అయిన సరస్వతి దేవిని ప్రసన్నం చేసుకోవడమే ఆయన లక్ష్యం. ఎన్నో సంవత్సరాల తపస్సుకు మెచ్చిన దేవి ప్రత్యక్షమై, ఒక ప్రత్యేకమైన నియమాన్ని విధించింది. ఒక చిన్న పండుగింజను నాటి, ఆ చెట్టు పెరిగి ఫలమిచ్చే వరకు ఓర్పుతో తపస్సు కొనసాగించాలని ఆజ్ఞాపించింది.
కాలక్రమంలో ఆ గింజ నుంచి రేగు చెట్టు ఎదిగి, చివరకు ఒక రోజు పాకిన రేగు పండు వ్యాసదేవుడి తలపై పడింది. అది మాఘ శుక్ల పంచమి రోజు కావడం విశేషం. ఆ క్షణాన్ని దైవ సంకేతంగా భావించిన వ్యాసుడు, ఆ రేగు పండును సరస్వతి దేవికి నైవేద్యంగా సమర్పించి, తన జ్ఞానసాధనను కొనసాగించాడు. ఆ తరువాతే బ్రహ్మసూత్రాల రచన ప్రారంభమైందని పురాణ కథనం చెబుతోంది.
ఈ గాథతో రేగు పండు జ్ఞానం, ఓర్పు, సాధనకు ప్రతీకగా మారింది. అందుకే సరస్వతి పూజలో రేగు పండుకు అంత ప్రాముఖ్యత. దేవికి ముందుగా సమర్పించకుండా తినడం జ్ఞానానికి అవమానంగా భావిస్తారనే నమ్మకం ఏర్పడింది. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు.. విద్య అనేది కాలంతో, నియమంతో, సహనంతోనే సిద్ధిస్తుందన్న లోతైన సందేశాన్ని కూడా ఈ సంప్రదాయం గుర్తు చేస్తుంది.
