బీజేపీ పార్టీకి తలనొప్పిగా మారిన సాగర్ ఉపఎన్నిక !

Sagar by-election candidate selection turned out to be a headache for BJP party

తెలంగాణ: నాగార్జున సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి జానారెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయ్యింది. టీఆర్ఎస్‌లో మాత్రం ఇంకా అభ్యర్థి ఖరారు కాకపోయినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికే టికెట్ కేటాయించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రచారం విన్పిస్తోంది. అయితే ఇతర పార్టీలకు భిన్నంగా బీజేపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఖరారు చేస్తే మంచి ఫలితం ఉంటుందని బీజేపీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారట.

Sagar by-election candidate selection turned out to be a headache for BJP party
Sagar by-election candidate selection turned out to be a headache for BJP party

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీజేపీ రెండు గ్రూపులుగా మారిపోయింది. ప్రస్తుత నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి భార్య నివేదితారెడ్డి సాగర్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ నివేదితా సాగర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇదే సమయంలో బీసీ సామాజికవర్గంలో మంచి నేతగా గుర్తింపు ఉన్న కడారి అంజయ్యయాదవ్ ఉపఎన్నిక టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర రాజకీయ అగాథం ఏర్పడిందనే చెప్పాలి. టికెట్ మాకే కన్‌ఫర్మ్ అయ్యిందంటే… మాకు అయ్యిందంటూ ఇద్దరు ఇప్పటికే ప్రచార వేగం పెంచారు. దీంతో సాగర్ బీజేపీ రెండు గ్రూపులుగా మారింది.

బీజేపీ టికెట్ రేసులో ఉన్న కంకణాల నివేదిత, కడారి అంజయ్యయాదవ్ సంగతి పక్కనబెడితే.. టీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న మరికొంతమంది నేతలు బీజేపీలోకి జంప్ కొట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే చాలామంది టీఆర్ఎస్ నేతలు బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో టచ్‌లో ఉన్నారు. బీజేపీ సైతం బలమైన నేతలుగా గుర్తింపు ఉన్న ఒక్కరిద్దరితో నేరుగా సంప్రదింపులు చేస్తోంది. ఇదిలావుంటే… సాగర్ ఉపఎన్నిక టికెట్‌ను నోముల కుటుంబానికి ఇస్తే.. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఎంసీ కోటిరెడ్డి ఆ పార్టీని వీడేందుకు వెనకాడబోరని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంసీ కోటిరెడ్డిని తమవైపు లాక్కునేందుకు బీజేపీ తెర వెనుక ప్రయత్నాలను ఇప్పటికే మొదలుపెట్టిందని సమాచారం.

సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు బిజేపి పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థిత్వతం కోసం హోరా హోరీ పోరు మొదలయ్యింది. పోటీ చేసేందుకు ఇప్పటికే అశావాహుల సంఖ్య పెరగడంతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది అశావాహులు ఇటువైపు చూస్తుండడం అసమ్మతి రాగానికి ఓ కారణమనే చెప్పాలి. దీనికితోడు సొంత పార్టీ నేతలు గ్రూపులుగా ఏర్పడి.. ఎవరి దారి వారిదే.. అన్న చందంగా ముందుకుసాగుతున్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.