తెరాస, కేసీఆర్ పేర్లు చెబితే ఒంటికాలు మీద లేస్తారు ఎంపీ రేవంత్ రెడ్డి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కేసీర్ మీద యుద్ధం ఆపనని ఏనాడో ప్రకటించేసింది రేవంత్ రెడ్డి నూటికి నూరుపాళ్లు ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా కాకుండా అవకాశాన్ని క్రియేట్ చేసుకుని మరీ బీజేపీ పాలక వర్గం మీద విరుచుకుపడుతున్నారు. కేసులు మీద పడినా జంకలేదు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా గెలిచి రెట్టింపు బలం పుంజుకున్నారు. సొంత పార్టీ కాంగ్రెస్ నుండి కొందరు నేతలు కాళ్లకు ఆడ్డంపడుతున్న తన పని తాను చేసుకుని పోతున్నారు. ఇటీవలే దుబ్బాక ఎన్నికల్లో కేసీఆర్ మీద, తెరాస మీద ఓ రేంజ్ లో ఫైట్ చేసిన ఆయన ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలకు రెడీ అయిపోయారు.
ఎన్నికలు అనుకున్న సమయానికే వస్తాయా లేకపోతే వాయిదాపడతాయా అనే విషయంతో సంబంధం లేకుండా ఇప్పటి నుండే ప్రత్యర్థి మీద విరుచుకుపడిపోవడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం గ్రేటర్ ఓటర్లలో ప్రభుత్వం పట్ల ఉన్న అతిపెద్ద అసంతృప్తి వరదలు. నగరం మునిగిపోవడానికి కారణం తెరాస అలసత్వమేనని జనం కోపం. తీవ్ర ఇబ్బందులుపడిన వారంతా నేతల ముఖం మీదే తిట్ల దండకం చదివేశారు. ఆ అసంతృప్తిని ఆసాంతం కొనసాగేలా చేయాలని రేవంత్ ప్లాన్ చేశారు. అందుకు వరద సహాయాన్ని ఆయుధంగా వాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వరద ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి 10వేల రూపాయల సహాయం ప్రకటించింది.
మామూలుగా అయితే ఇలాంటి పరిహారాన్ని, సహాయాలను ప్రభుత్వం నేరుగా బాధితుల ఖాతాల్లోకే వేసేస్తుంది. లేదా ప్రభుత్వ అధికారుల ద్వారా వారికి చేరేలా చేస్తుంది. కానీ ఇక్కడ తెరాస నాయకుల అనుచరులే నోట్ల కట్టలు చేతపట్టుకుని పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సరే పంచేవాళ్లేమైనా సక్రమంగా చేశారా అంటే అదీ లేదు. ఆ వరద సహాయంలో కూడ చేతివాటం చూపారు. 10 వేలు ఇవ్వవలసి ఉండగా కొన్నిచోట్ల నాయకుల అనుచరులు అందులో నుండి వెయ్యి, రెండు వేలు కమీషన్లు లాగే ప్రయత్నం చేశారు. దీంతో జనం ఇంత కక్కుర్తి ఏమిటని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ జోనల్ మున్సిపల్ కమిషనర్లను కలుస్తూ వరద సాయంలో అవినీతి జరిగిందని తెరాస నేతలు కోట్లకు కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ విజిలెన్స్, ఏసీబీ విచారం జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన డిమాండ్ మేరకు అధికారులు విచారణ చేపడితే కమీషన్లు తిన్న అనుచరుల బ్యాచ్ మొత్తం బయటకురాక తప్పదు. ఈ అనుచరులందరూ అధికార పార్టీ కార్పొరేటర్ల మనుషులట. అందుకే తమ పేర్లు ఎక్కడ బయటికొస్తాయోనని సదరు లీడర్లు వణుకుతున్నారట.