కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి తన రాజకీయ చతురతను కనబరిచారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్ధి పార్టీ తక్కువ సీట్లు గెలుచుకునేలా చేసి టిఆర్ఎస్ కు అధిక స్థానాలు దక్కకుండా చేశారు. కొడంగల్ పరిధిలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 30 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలు గెలుచుకోగా టిఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 3 స్థానాలు గెలుచుకోగలిగారు. దీంతో రేవంత్ రెడ్డి మరోసారి తన సత్తా ఏంటో చాటారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. పూర్తిగా తన వ్యాపార కార్యక్రమాల పై దృష్టి పెట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లొచ్చారు. ఇంతలోనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అయినా కూడా రేవంత్ లోలోపల రాజకీయం చేశారు. రేవంత్ ఉలుకు పలుకు లేదని జనం చర్చించుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉన్నారు. ఎలాగైనా కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు గెలుచుకొని మళ్లీ తమ సత్తా చాటాలని వారికి దిశా నిర్దేశం చేశారు.
చాలా గ్రామాలలో అభ్యర్దులు పోటి పడడంతో రేవంత్ రెడ్డి నేరుగా ఆ గ్రామాలకు వెళ్లి వారితో చర్చించి అభ్యర్ధిని ఫైనల్ చేశారు. ఎక్కడ కూడా పార్టీ సభ్యులు వేరే పార్టీలోకి వెళ్లకుండా జాగ్రపడ్డారు. పలు జాగ్రత్తలు ఇస్తూ నిత్యం వారికి అందుబాటులో ఉన్నారు. నామినేషన్ వేసే సమయంలో కాంగ్రెస్ అభ్యర్ధి కిడ్నాప్ కు గురైతే రేవంత్ రెడ్డి వెంటనే అక్కడకు చేరుకొని ఎస్పీతో మాట్లాడారు. నామినేషన్ ఆగకుండా కిడ్నాప్ ఐన అభ్యర్ధి తరపున నామినేషన్ వేయించారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కీలక గ్రామాలలో తిరిగారు. అభ్యర్దుల తరపున ప్రచారం చేశారు. మీడియాలో హైప్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఆయన వచ్చే రోజు మాత్రమే ఉదయం ఆ గ్రామ అభ్యర్దికి సమాచారమిచ్చి వచ్చారు. గ్రామంలో పర్యటనలు చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
ఓ వైపు ఇలా చేస్తూనే రాష్ట్ర నాయకత్వంలో కూడా తన పాత్ర పోషించారు. ఎక్కడ బయట కనిపించకుండా లోలోపల తన రాజకీయ మంత్రదండాన్ని రేవంత్ ప్రదర్శించారు. దీంతో రేవంత్ చాతురత తెలుసుకున్న పలువురు ఆయనను అభినందిస్తున్నారు. అనుకున్నట్టుగానే కొడంగల్ పంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎక్కవ స్థానాలు గెలుచుకుంది.