తలుపులు బద్ధలు కొట్టి అరెస్టులు చేయాల్సిన ఎమర్జెన్సీ తెలంగాణలో ఉందా? నాడు జెఎసి ఛైర్మన్ కోదండరాం ఇంటి తలుపులు బద్ధలు కొట్టి ఆయనను అరెస్టు చేశారు పోలీసులు. అదే సీన్ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు కొడంగల్ లో జరిగింది. అక్కడ ఎలాగైతే కోదండరాం ను బలవంతపు అరెస్టు చేశారో ఇక్కడ కూడా సేమ్ సీన్ రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. తలుపులు బద్ధలు కొట్టి పోలీసు బలగాలు రేవంత్ రెడ్డి బెడ్రూమ్ లోకి వెళ్లి మరి బర్ర బర్ర ఈడ్చుకుంటూ తీసుకొచ్చి జీపు ఎక్కించారు. ఆనాడైనా, ఈనాడైనా ఈ తరహా అరెస్టులతో తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు సాధించేదేమిటి? తెలంగాణ సర్కారుకు వచ్చే లాభమెంత?
తెలంగాణ రాజకీయాలు లేదు లేదంటూనే కేసిఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా మారిపోతున్నాయి. రేవంత్ రెడ్డిని కొడంగల్ గడ్డ మీద చీమలా నలిపేయాలనుకున్న టిఆర్ఎస్ ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. తుదకు టిఆర్ఎస్ వ్యూహాత్మక ఎత్తుగడలు అన్నీ రేవంత్ నెత్తిన పాలు పోసేలా చేశాయి. మిడ్ నైట్ 3 గంటల సమయంలో రేవంత్ రెడ్డి ఇంటి తలుపులు బద్దలు కొట్టి బెడ్రూమ్ లోకి వెళ్లి అరెస్టు చేయడం మాత్రం తెలంగాణ పోలీసులకు, టిఆర్ఎస్ సర్కారుకు ఏరకంగా చూసినా మేలు చేకూర్చే అవకాశం లేదని విశ్లేషకులు (ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ ) చెబుతున్నారు.
ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే కొడంగల్ లో రేవంత్ రెడ్డిని మట్టి కరిపించాలని టిఆర్ఎస్ వ్యూహరచన చేసింది. సిఎం కేసిఆరే కాదు, ఆయన తనయుడు కేటిఆర్ కూడా రేవంత్ ను ఎట్టి పరస్థితుల్లోనూ అసెంబ్లీలో కాలు పెట్టనీయబోరాదని కంకణం కట్టుకున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే లోక్ సభ ఎన్నికల నాటికి కేసిఆర్ సిఎం కుర్చీ దిగిపోయి కేటిఆర్ ను కూసోబెట్టాలన్న వ్యూహరచన చేశారు. కేసిఆర్ జాతీయ రాజకీయాలు నడపాలన్న ప్లాన్ లో ఉన్నారు. దీంతో రేవంత్ అనే ఫైర్ బ్రాండ్ తెలంగాణ అసెంబ్లీలో ఉంటే అస్తమానం చికాకులు తప్పవు అని కేటిఆర్ భావించారు. అందుకే రేవంత్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు.
కొడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కొడంగల్ ను తానే దత్తత తీసుకుంటానని కేటిఆర్ జనాలకు ఆఫర్ పెట్టారు. అంతలోనే నరేందర్ రెడ్డి నివాసం ఉంటున్న ఫామ్ హౌస్ లో లెక్కలు లేని నోట్ల కట్టలు పోలీసులకు చిక్కాయి. 51 లక్షలే దొరికాయని పోలీసులు చెబుతుంటే 17 కోట్లకు పైమాటే అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఈ లెక్కలె చెప్పలేక నరేందర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఇక ఇదే కొడంగల్ మీద కేటిఆర్ ఎంతగా ఫోకస్ పెట్టారో కేటిఆర్ బావ హరీష్ రావు కూడా అంతే స్థాయిలో ఫోకస్ పెట్టారు. పోటీ పడి బావ, బామ్మార్దులు కొడంగల్ చుట్టే తిరుగుతూ వాతావరణం వేడెక్కించారు.
ఇక మంగళవారం కొడంగల్ లో కేసిఆర్ సభకు భారీ ఏర్పాట్లే చేస్తున్నారు. కానీ అదే సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుల ఇండ్లలో రైడ్స్ జరిగాయి. దీన్ని రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. రాత్రిపూట రోెడ్ల మీద ధర్నాలు చేశాడు. కోస్గి, బొంరాస్ పేట, కొడంగల్ ఏరియాల్లో రేవంత్ మనుషులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఇక ఇక్కడితో ఆగలేదు పోలీసులు వ్యవహారం. రేవంత్ అనుచరుల ఇండ్లలో రైడ్స్ కంటే ముందే రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను హత్య చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. అందుకోసమే తాను ప్రచార సభలు రద్దు చేసుకున్నట్లు చెప్పుకున్నారు. దీంతో రేవంత్ కొడంగల్ కే పరిమితమయ్యారు. రేవంత్ రెడ్డి తన హత్యకు కుట్ర అన్న విమర్శలు చేసిన సమయంలో కొడంగల్ లో టిఆర్ఎస్ కు అంతో ఇంతో పట్టు దొరికిందని, ఇక దూకుడు పెంచితే రేవంత్ ను మట్టికరిపించొచ్చని భావించారు.
కానీ తర్వాత పరిణామాలతో టిఆర్ఎస్ కు చిక్కిన పట్టు జారిపోయిందనే చెప్పవచ్చు. ఎందుకంటే కేసిఆర్ సభ వేళ రేవంత్ రెడ్డి బంద్ కు పిలుపునివ్వడం, తర్వాత బంద్ స్థానంలో అక్రమ సోదాలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేయాలని పిలుపును మార్చారు. దీంతో ఇక టిఆర్ఎస్ కు కష్టకాలమే మొదలైంది. ఒకవైపు కొడంగల్ లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అదే సమయంలో కేసిఆర్ సభ కోసం పోలీసులు, టిఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు 144 సెక్షన్ అంటే మీటింగ్ లు పెట్టొద్దు కదా? మరి గుంపులు గుంపులుగా కూడా తొరగొద్దు కదా? అని రేవంత్ రెడ్డి సతీమణి గీత ప్రశ్నించడంతో పోలీసుల వద్ద జవాబు లేదు.
ఇదేదో పోలీసులు టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు ఈ పరిణామం బలం చేకూర్చింది. దానికితోడు అసలు రేవంత్ రెడ్డిని తలుపులు పగలగొట్టి బెడ్రూమ్ లోకి వెళ్లి మరి అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. ఆ రకంగా సుపీరియర్స్ ఎందుకు ఆదేశాలు జారీ చేశారు. నిజంగా రేవంత్ రెడ్డి ప్రశాంత వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తాడనుకుంటే అదే ఇంట్లో హౌస్ అరెస్టు చేయవచ్చు కదా? ఒకవైపు 144 సెక్షన్ పెట్టి మరోవైపు రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి నియోజకవర్గ పొలిమేరలు దాటించడాన్ని ఎలా సమర్థించుకుంటారు ఫ్రెండ్లీ పోలీసులు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి మామ మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి చాలా ఘాటుగా రియాక్ట అయ్యారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసిఆర్ బిడ్డ ఇంటి తలుపులు పగలగొట్టి బెడ్రూమ్ లోకి పోతే మీరు అంగీకరిస్తారా? పోనీ జనాలు అంగీకరిస్తారా అని తీవ్రమైన భాషలో ప్రశ్నలు సంధించారు.
ఏది ఏమైనా పోలీసులు చేసిన వ్యవహారం మాత్రం టిఆర్ఎస్ కు మేలు చేసేకంటే కొడంగల్ లో రేవంత్ రెడ్డి కే మేలు చేకూరుస్తుందని తేలిపోయింది. ఇదే అవకాశంగా భావించిన రేవంత్ సతీమణి ీగీత ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ కంటే గొప్పగా రియాక్ట్ అయ్యారు. రేవంత్ అరెస్టుపై జనాలు ఓటుతోనే జవాబు చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. రేవంత్ ను ఓడిస్తామన్న ధీమాతో ఉన్న టిఆర్ఎస్ కు ఈ పరిణామాలు ఏమేరకు ఉపయోగపడతాయో రేపు పోలింగ్ లో తేలనుంది.
రేవంత్ రెడ్డి మా అదుపులోనే ఉన్నాడు : ఎస్పీ
రేవంత్ రెడ్డి మా అదుపులోనే ఉన్నాడని వికారాబాద్ జిల్లా ఎస్పీ అన్నపూర్ణ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఎన్నికల ప్రచారం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా రేవంత్ ను అదుపులోకి తీసుకున్నాం అని ఆమె వివరణ ఇచ్చారు. కేసిఆర్ సభ ముగిసిన వెంటనే రేవంత్ రెడ్డి ని వదిలేస్తామన్నారు. ఈసీ అదేశాల మేరకే రేవంత్ రెడ్డి పై కేసులు నమోదు చేశామన్నారు. ముందస్తు అరెస్ట్ లో భాగంగానే రేవంత్ ను అదుపులోకి తీసుకొని మహబూబ్ నగర్ తరలించామని చెప్పారు.