గతం మరిచిన రేవంత్ కొత్త కోరిక… మంచిదే!

తెలంగాణా రాజకీయాల్లో రేవంత్ స్థానం కాస్త ప్రత్యేకమనే చెప్పాలి! రేవంత్ కంటూ స్పెషల్ మాస్ ఫ్యాన్ బెల్ట్ ఉన్నమాట వాస్తవం! టీడీపీ నుంచి కాంగ్రెస్ కి జంప్ చేసిన అతికొద్ది రోజుల్లోనే అక్కడ టీపీసీసీ చీఫ్ అయ్యారంటేనే రేవంత్ సామర్థ్యం ఇట్టే అర్థమవుతుంది! ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే… తాజాగా రేవంత్ ఒక కొత్త డిమాండ్ చేశారు! ప్రస్తుతం ఈ అంశంపై కొంతమంది “మంచిదే” అని రియాక్ట్ అవుతుంటే… “తమవరకూ వస్తే కానీ తత్వం బోదపడలేదా” అని మరికొంతమంది కౌంటర్స్ వేస్తున్నారు!

అవును… కాంగ్రెస్ పార్టీలో గెలిచి, పార్టీ ఫిరాయించి అధికారపార్టీలో చేరిన 12మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి! అంతవరకు బాగానే ఉంది కానీ… తాను గతంలో టీడీపీలో ఉన్నపుడు బాబు గారు ప్రోత్సహించిన ఫిరాయింపుల సంగతి కూడా రేవంత్ ఒకసారి తప్పని చెప్పి ఉంటే బాగుండేది! తాను ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో ఆపరేషన్ ఆకర్ష పేరుతో చేసిన సందడి అంతా ఇంతా కాదన్న విషయం మరవ కూడదు!

ఫిరాయింపులను ఏ ప్రజాస్వామ్య వాదులూ సమర్ధించరు. కానీ… ప్రతీ నాయకుడూ ఈ విషయాలనూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే “ప్రశిస్తూ”.. అధికారపక్షంలో ఉన్నప్పుడు మాత్రం “మా అభివృద్ధిని చూసి వచ్చేస్తున్నారు” వంటి కబుర్లు చెప్పకూడదు! మరి ఈ విషయంలో రేవంత్ కూడా తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర సీఎం లకు ఇవే చెబుతారా? భవిష్యత్తు బాగుండి రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇంత ఖచ్చితంగా ఉంటారా? కాలమే సమాధానం చెప్పాలి!

ఏది ఏమైనా… ఫిరాయింపులు చేసే నాయకులను (గోడమీద పిల్లులు – గోపి) లను ప్రజలు ఏమాత్రం క్షమించకూడదనే కోరుకుంటున్నారు ప్రజాస్వామ్య వాదులు! ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీల పెద్దలు కాస్త విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది!