‘తుర్క కుక్కలు, కోమటి కుక్కలు’ భాషపై రేవంత్ ఫైర్ (వీడియో)

మైనార్టీలను తుర్క కుక్కలు అని, వైశ్యులను కోమటి కుక్కలు అని విమర్శించిన టిఆర్ఎస్ నేతలు తక్షణమే భేషరతు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మైనార్టీలను, వైశ్యులను కుక్కలతో పోల్చి చెప్పిన టిఆర్ఎస్ నేతలు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ కొడంగల్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణలే కాకుండా అంబేద్కర్ విగ్రహం వద్ద క్షమాపణలు చెప్పాలన్నారు. 

క్షమాపణలు చెప్పకపోతే రానున్న ఎన్నికల్లో మైనార్టీ సోదరులు, వైశ్య సోదరులు కొడంగల్ లోనే కాకుండా తాండూరులోనూ వారి తడాఖా చూపుతారని హెచ్చరించారు. తాండూరులో మంత్రి మహేందర్ రెడ్డి దాష్టికాలు తట్టుకోలేక అయూబ్ ఖాన్ అనే తెలంగాణ పోరాట యోధుడు ఆత్మబలిదానం చేసుకున్నాడని గుర్తు చేశారు. అయూబ్ ఖాన్ చావుకు మహేందర్ రెడ్డే కారణమన్నారు.

అంతేకాకుండా తాండూరు మున్సిపల్ ఛైర్మన్ వెంకటయ్య అనే వ్యక్తి చావు బతుకుల మధ్య ఉంటే ఆయనను కనికరించకుండా పదవి నుంచి తొలగించి ఆయన చావుకు కారణమైండని రేవంత్ ఆరోపించారు. వైశ్య కులానికి చెందిన వెంకటయ్యను పొట్టనపెట్టుకున్నదే మహేందర్ రెడ్డి అన్నారు. అయూబ్ మృతికి, వెంకటయ్య మృతికి కారణమైన వ్యక్తి మహేందర్ రెడ్డి అని చెప్పారు. 

గుర్నాథ్ రెడ్డి కొడుకు ముద్దప్ప పైనా రేవంత్ మండిపడ్డారు. ముద్దప్ప ఎవడో కాదు ఉద్దెరప్ప అని జనాలు అనుకుంటున్నారని ఆ ఉద్దెరప్ప మాటలకు విలువేముందని ప్రశ్నించారు. మైనార్టీలకు, వైశ్యులకు పట్నం సోదరులు క్షమాపణ చెప్పకపోతే బజారులో నిలబెట్టి తగిన సన్మానం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. 

ఎన్నికల ప్రచార సభలో మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డిలే మాట్లాడారు కాబట్టి వారే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పట్నం సోదరులు పోరంబోకు మాటలు మాట్లాడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు.  ఏం పీకుతారో చూస్తా అన్నారు కదా ఆ పీకుడేందో వారికి ముందు ముందు  చూపిస్తామన్నారు.

రేవంత్ రెడ్డి కొడంగల్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియో కింద ఉంది మరిన్ని అంశాలు కోసం వీడియో చూడండి.

 

WhatsApp Video 2018 10 19 at 4 35 42 PM