తెలంగాణ ఫలితాల పై రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే

తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రజలు ఇచ్చిన ఏ నిర్ణయాన్నైనా తాము శిరసావహిస్తామన్నారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఏమన్నారంటే….

“తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తాం. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. గెలిచినంత మాత్రాన ఎగిరిపడడం, ఓడినంత మాత్రాన కుంగిపోవడం అనేది ఉండదు. ఖచ్చితంగా ఒకరు ఓడుతారు, ఒకరు గెలుస్తారు. ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరం కాదు. ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజల కొరకు నేను పోరాడుతాను.  ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తన పద్దతి మార్చుకోవాలి.

గతంలో లాగ ఉండకుండా ప్రజాసమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టాలి. తక్షణమే అమర వీరుల కుటంబానికి న్యాయం చేయాలి. ఉద్యమ కారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి.  నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. విద్యార్దులందరికి మంచి విద్యనందించాలి. నోటిఫికేషన్లు వేయాలి. రైతుల ఆత్మహత్యలు ఆగేలా చూడాలి.

ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ పై తర్వాత మాట్లాడుతాను. దాని గురించి క్లారిటిగా తెలిశాక స్పందిస్తాను. జరిగిందా లేదా అనేది తర్వాత తెలుస్తది. ప్రజలు తమకు ఇచ్చిన బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తాం. ప్రజా సమస్యల పై కాంగ్రెస్ పార్టీ పోరాడుతది. ప్రజలక కోసం ఎంత వరకైనా పోరాడేందుకు సిద్దంగా ఉన్నాం. ఓటమికి దారితీసిన పరిస్థితుల పై చర్చిస్తాం. లోటు పాట్లను సరిచేసుకోని ముందుకు పోతాం. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో బంధి అయిన పాలనను సచివాలయానికి తీసుకువస్తారని ఆశిస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నాను.

నా సవాల్ కు కేటిఆర్ స్పందించలేదు. కేటిఆర్ స్పందన పైనే నా నిర్ణయం ఉంటుంది. స్వ ప్రయోజనాల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకోసమే వచ్చాను. ప్రజలల్లో ఉన్నాను. గెలిచినా ఓడినా ప్రజలల్లో ఉంటాను. ప్రజా సమస్యల పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. కేసీఆర్ మరింత బాధ్యతగా పాలన చేస్తారని ఆశిస్తున్నాను. ఫలితాలలో ఇంత వ్యత్యాసం వస్తుందని అనుకోలేదు. ప్రజల నిర్ణయాన్ని శిరసా వహిస్తాం. కాంగ్రెస్ నేతలతో చర్చించాక మరిన్ని విషయాలు చెబుతాను.

తెలంగాణలో ఓడిపోయినంత మాత్రాన ఫైటింగ్ ఆపం. ప్రజా సమస్యల పై  నిరంతరం పోరాడుతాం. ప్రజలకు అండదండగా ఉంటాం. రాజకీయాలలోకి ప్రజా సేవ చేయడానికే వచ్చాను. పదవి ఉన్నా లేకున్నా నా జీవితం ప్రజలకే అంకితం. ప్రజా సేవలోనే ఉంటాను. కొడంగల్ ప్రజలు నన్ను రెండు సార్లు ఆశీర్వదించారు. వారికి నేను రుణపడి ఉంటాను. ఈ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని నేను శిరసా వహిస్తాను. 

 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ  ప్రగతి కోసం చాలా ప్రణాళికలు వేసుకున్నాం. తెలంగాణను ముందుకు తీసుకెళ్లేందుకు కంకణం కట్టుకున్నాం. అధికారం లేకున్నా ప్రజలకు ఫలాలు అందేలా పోరాడుతాం. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తాం.

కార్యకర్తలు, అభిమానులు ఎవరు కూడా కుంగి పోవద్దు. ఇలా ఎందుకు అయ్యిందో బేరిజు వేసుకోని ముందుకు పోదాం. అంతే కానీ అనవసరంగా మీరు ఇబ్బంది పడవద్దు. ఎన్నికలలో సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన సమయాన నాకు , నా కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన వారికి నేను రుణపడి ఉంటాను. త్వరలోనే పార్టీ నేతలతో చర్చించిన తర్వాత మరిన్ని విషయాలు చెబుతాను.” అని రేవంత్ రెడ్డి అన్నారు.