టిడిపి నుంచి తనతోపాటు తన వర్గంగా చాలా మంది సీనియర్లు, జూనియర్లను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ సమక్షంలో కొందరు నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొందరు నేతలు తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అయితే రేవంత్ రెడ్డి వర్గానికి కాంగ్రెస్ లో తొలి జాబితాలో మెరుగైన స్థానాలే దక్కాయని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. మరి రేవంత్ రెడ్డి వర్గం వారెవరు? వారికి ఎన్ని సీట్లు వచ్చాయి? వివరాలు చదవండి.
రేవంత్ రెడ్డి ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యేలు ములుగు సీతక్క, పెద్దపల్లి విజయరమణారావు, మాజీ మంత్రి బోడ జనార్దన్, తోటకూరి జంగయ్య యాదవ్, ఓయు జెఎసి నేత రాజారాం యాదవ్, బాల లక్ష్మి, మేడిపల్లి సత్యం తదితరులు కాంగ్రెస్ గూటికి చేరారు.
రేవంత్ రెడ్డి టిడిపిలో వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్ లోనూ వర్కింగ్ ప్రసిడెంట్ పదవి దక్కింది. ములుగు సీతక్కకు జాతీయ స్థాయిలో మహిళా కాంగ్రెస్ లో పదవి దక్కింది. మరికొందరు నేతలకు పదవులు వస్తాయన్న ఆశతో ఉన్నారు.
అయితే తాజాగా వివాదాలు లేని సీట్లకు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా సిద్ధం చేసింది. 41 మందితో ఆ జాబితా సిద్ధం చేశారు. ఆ జాబితాను నవంబరు 2వ తేదీన వెలువరించే చాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆ జాబితాతోపాట మరికొన్ని పేర్లు యాడ్ చేసిన 50 మంది వరకు తొలి జాబితాలో పేర్లు వెల్లడయ్యే చాన్స్ ఉంది.
అయితే కాంగ్రెస్ పార్టీ వెలువరించనున్న తొలి జాబితాలో రేవంత్ వర్గానికి మూడు సీట్లు దక్కినట్లు తెలుస్తోంది. అందులో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క, పెద్దపల్లి నుంచి విజయరమణారావు కు సీట్లు ఖరారు చేశారు. రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ లో చేరిన వారిలో మరికొందరు నేతలు కూడా సీటు ఆశిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, సూర్యాపేట నుంచి పటేల్ రమేష్ రెడ్డి, ఆర్మూరు నుంచి రాజారామ్ యాదవ్, నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మేడ్చల్ నుంచి తోటకూర జంగయ్య యాదవ్ ఇలా మొత్తం 15 మంది వరకు రేవంత్ జాబితా ఉన్నట్లు చెబుతున్నారు.
మహా కూటమి ఫైనల్ అయిన తర్వాత లిటిగేషన్ లో ఉన్న సీట్లను క్లియర్ చేసే పని చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ కోరుతున్న 15 మంది జాబితాలో మరో 12 మందికి సీట్లు రావాల్సి ఉంది. రాహుల్ గాంధీ సమక్షంలో చేరే సమయంలోనే రేవంత్ తనతోపాటు వచ్చే వారి జాబితాను ఎఐసిసి నేతలకు అందజేసినట్లు తెలుస్తోంది.
రేవంత్ భరోసాతోనే టిడిపి నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ములుగు సీతక్కను టిఆర్ఎస్ లో చేర్పించుకునేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారు. అయినా దొరల స్వభావాన్ని వ్యతిరేకించే సీతక్క టిఆర్ఎస్ వైపు అడుగులు వేయలేకపోయారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆమె రేవంత్ తో సహా కాంగ్రెస్ గూటికి చేరారు.
రేవంత్ రెడ్డి కానీ, సీతక్క కానీ, పెద్ద పల్లి విజయరమణారావు కానీ, వేం నరేందర్ రెడ్డి కానీ కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ ఏనాడూ వారు టిడిపి పార్టీపై పల్లెత్తు మాట అనలేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబును కూడా ఏనాడూ విమర్శించలేదు. టిడిపి ఇంకా మా పార్టీనే అన్న భావనలో వారు ఉన్నారు.
అయితే రేవంత్ తో పాటు పార్టీలో జాయిన్ అయిన వారిలో ఎవరికి వస్తాయి? కూటమిలో భాగంగా ఎవరికి రాకుండా ఉండే చాన్స్ ఉంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.