తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి జైలుకు వెళ్లక తప్పదా? జైలుకు వెళ్లాల్సి వస్తుందని రేవంత్ కూడా ఫిక్స్ అయ్యారా? నాలుగు నెలల పాటు జైలులో ఉంచే అవకాశం ఉందన్న రేవంత్ మాటల్లో నిజమెంత? కోస్గిలో రేవంత్ భావోద్వేగ ప్రసంగం వెనుక ఆంతర్యమేమిటి? జైలు నుంచి నామినేషన్ పత్రాలు పంపిస్తా అని రేవంత్ చేసిన కామెంట్స్ పరమార్థం ఏమిటి? చదవండి.
గురువారం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అదే సమయంలో హైదరాబాద్ లో తన నివాసంలో ఐటి దాడులకు దిగింది. ఐటి దాడులు జనాలకు తెలియకపోయినా రేవంత్ కు మాత్రం దాడులు తప్పవని తెలుసు. అంతేకాదు తనను మళ్లీ జైలుకు పంపుతారని కూడా రేవంత్ ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో కొండగల్ నియోజకవర్గంలోని కోస్గిలో రేవంత్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే…
మోడీ కేడీ ఇద్దరు కలిసి నా ఇంటి మీద దాడులు చేస్తున్నారు. ఆ రోజు నా బిడ్డ లగ్న పత్రిక రాసుకుంటుంటే నేను లేకపోయినా లక్షలాది మంది తమ చేతులతో పత్రిక రాసిండ్రు. ఈ రోజు మళ్ళీ మోడీ జీతగాల్లో, కేసీఆర్ పనోల్లో నా ఇంటి మీదికి వచ్చారు. నా తమ్ముడి భార్యను కూడా అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ నీచానికి దిగజారుడు తనానికి ఇది నిదర్శనం.
2009 వరకు కొడంగల్ పేరు రాష్ట్రంలో ఎక్కడా వినబడలేదు. 10 సంవత్సరాల్లో కొడంగల్ పేరు ఢీల్లి విధుల్లో వినబడుతున్నది. కొడంగల్ లో ఎలాగైనా నన్ను ఓడగొట్టాలని 100 కోట్ల తో పట్నం ముఠాలను దించిండు. పిల్లనిచ్చిన మామా చనిపోతే చూడటానికి రాని నరేందర్ రెడ్డి అనేటోడు నాకు పోటీనా? కేసీఆర్ కు కొడంగల్ కే పోటీ.
జైల్ లో చిప్పకూడు తిన్న అభిమానముతో చెప్తున్న కేసీఆర్ ను గద్దె దింపుతా. ఈ ఎన్నికల్లో ఇదే నా చివరి ఉపన్యాసం కావొచ్చు. కేసీఆర్ మోడీ ఇద్దరు కలిసి నన్ను 4 నెలలు జైల్లో పెట్టాలని చూస్తున్నారు. ఉదయం నుంచి నా ఇంటి నిండా పొలీసులే కూర్చున్నారు. నన్ను ప్రచారం ఆపేసి హైద్రాబాద్ రమ్మని ఫోన్ చేస్తున్నారు. నేను ఎన్నికల్లో ప్రచారం చేస్తే కేసీఆర్ ఇంటికి వెళ్లాల్సి వస్తుందని నా మీద కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడను.
కేసీఆర్ గుర్తు పెట్టుకో నీకు మిత్తీ తో సహా చెల్లిస్తా. కేసీఆర్ చేసిన పాపాలను అతని వారసులకు అప్పజెప్త. నరేంద్ర మోడీ ని చూసుకొని విర్రవీగుతున్నడు కేసీఆర్. ప్రతి యువకుడు ఒక రేవంత్ రెడ్డి లా ఎన్నికల్లో పోరాడాలి. వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్న. కొడంగల్ లొనే పోటీ చేస్తా, ఇక్కడే ఉంటా. ఒకడి ముందు తలవంచి బబతికే కంటే జైల్లో అయినా ఉంటా. కోస్గిలోనే నా చివరి ప్రసంగం కావొచ్చు. అన్ని మంచిగుంటే మల్లొస్త. ప్రచారం చేస్తా. ఏదైనా కింద మీద అయితే జైలు నుంచే నామినేషన్ పత్రాల మీద సంతకాలు పెట్టి పంపిస్త. మిరే చూసుకోండి.
నేను జైలులో ఉండి ప్రచారం చేసుకున్నా 50 వేల మెజారిటీతో కోడంగల్ లో విజయం సాధిస్తా. నా పోరాటంలో నాకు అండగా ఉండేవారు చేతులు ఎత్తండి. మీ మీద నమ్మకంతో కోస్గీ నుంచి హైద్రాబాద్ బయలుదేరుతున్నా.
రేవంత్ రెడ్డి మాటలు చూస్తేంటే ఎన్నికల వేళ ఆయనను జైల్లో పెట్టే అవకాశాలున్నట్లు స్పష్టమవుతున్నది. అందుకే ప్రచార కార్యదర్శి పదవి కోరిన రేవంత్ కు వర్కింగ్ ప్రసిడెంట్ పదవి వచ్చింది. పదవి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రేవంత్ మీడియా ముందుకొచ్చి మాట్లాడలేదు. పైగా తనను జైల్లో పెట్టేందుకు డిజిపి కుట్రలు పన్నుతున్నాడంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఇంతలోనే ఐటి అధికారులు రయ్ మంటూ వచ్చి చెకింగ్ లు చేశారు. రేవంత్ భయపడిందే నిజమవుతుందా? లేక అరెస్టులు లేకుండానే కేసులు పెట్టి వదిలేస్తారా అన్నది త్వరలోనే తేలుతుంది.
ఒకవైపు హైదరాబాద్ లోని తన నివాసంలో ఐటి దాడులతో హల్ చల్ చేస్తుంటే కొడంగల్ లో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి జోష్ మీదున్నారు. ఆయన కార్యకర్తల ర్యాలీలో పాల్గొన్న వీడియో కింద ఉంది. డోలు కొడుతూ రేవంత్ కేడర్ లో హుషార్ నింపారు.