మోడీకి రిప్లై… ముహూర్తం ఫిక్స్ చేసిన కేసీఆర్!

తాజాగా తెలంగాణ వచ్చిన ప్రధాని మోడీ… సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభలో సీఎం కేసీఆర్, ఆయన ఫ్యామిలీని.. అవినీతి, కుటుంబ పాలన అంటూ పరోక్షంగా విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ బీజేపీ జాతీయస్థాయి నేతా చేయనంతగా.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే… ఆ విమర్శలపై కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు రిప్లై రాలేదు. ఫ్యామిలీ మొత్తాన్ని మోడీ ఉతికేసినా ఇప్పటివరకూ సైలంటుగానే ఉన్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన బీఆరెస్స్ నేతలు మాత్రం… తగిన సమయం, సరైన వేదిక కోసం కేసీఆర్ వేచి చూస్తున్నారని చెబుతున్నారు.

నెల 14న అంబేడ్కర్ జయంతి.. అదేరోజు.. రాజ్యాంగ నిర్మాత భారీ విగ్రహావిష్కరణ ఘనంగా చేయాలని, భారీ ఎత్తున చేయాలని ఇప్పటికే బీఆరెస్స్ నేతలు ముహూర్తం ఫిక్స్ చేసేశారు. దీంతో… అదే రోజు, అదే భారీ వేదికపైనుంచి.. మోడీ ప్రస్తావించిన అంశాలపై ఘాటుగా రిప్లై ఇచ్చేందుకు కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారంట.

అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగంలో కేసీఆర్ ఏయే అంశాలను ప్రస్తావిస్తారన్నదానిపైనే రాజకీయ వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విధానపరంగానే సీఎం కేసీఆర్ జవాబివ్వాలనుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఇదే సమయంలో… సికింద్రాబాద్ లో తనపైనా, తన కుటుంబసభ్యులపైనా మోడీ చేసిన విమర్శలకు ధీటైన కౌంటర్స్ ఇవ్వాలని కేసీఆర్ ఫిక్సయ్యారంట.

అదే విధంగా… మరిముఖ్యంగా విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఈనాటికీ నెరవేరలేదన్న అంశంతో పాటు.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదనే అంశాన్ని కూడా వివరించడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారట. దీంతో… ఆరోజున మోడీకి కాస్త గట్టిగానే ఇవ్వానున్నారని, అది కూడా విధానపరమైన విమర్శలతో హోరెత్తించనున్నారని అంటున్నారు బీఆరెస్స్ వర్గాలు!