దుబ్బాకలో ఫలితాలు తారుమారు కావడానికి ప్రధాన కారణం తెరాస మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత. ఈసారి అధికార పార్టీకి చిన్న చురక పెడదామని దుబ్బాక ప్రజలు అనుకున్నారు. కాబట్టే వ్యతిరేక ఓట్లు వేశారు. ఈ వ్యతిరేక ఓట్లను ఒడిసిపట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. బీజేపీ నూటికి నూరు శాతం విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలను చూస్తే తెరాస, బీజేపీ మధ్యన ఓట్ల తేడా 1079 మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి 22196 ఓట్లు పడ్డాయి. అంటే 60 శాతం మంది జనం తెరాసను వద్దనుకున్నారు. ఆ 60 శాతం మందిలో 50 శాతం ఓట్లను బీజేపీ పొందగలిగితే కాంగ్రెస్ కేవలం 10 శాతానికి పరిమితమైంది.
మరి ప్రధాన ప్రతిపక్షం ఇంతలా దెబ్బతినడానికి కారణం ఏమిటయా అంటే నమ్మకం లేకపోవడం. జనంలో కాంగ్రెస్ పట్ల నమ్మకం లేదు. ఆ నమ్మకాన్ని బీజేపీ ఇవ్వగలిగింది. ప్రత్యామ్నాయం అంటూ వస్తే అది బీజేపీనే కావాలని ఓటర్లు అనుకున్నారు. రెండేళ్ల పదవీ కాలం కోసం జరిగే ఉప ఎన్నికల్లో దాదాపు అధికార పార్టేయే గెలుస్తుంది. ఎందుకంటే ఆ రెండేళ్లలో ఏవైనా పనులు జరుగుతాయని. కానీ దుబ్బాక ఓటర్లలో గెలిపించినా తెరాస చేసేదేమీ ఉండదనే నమ్మకం పడిపోయింది. అలాగే తెరాసకు తాము ప్రత్యామ్నాయం కాగలమని కాంగ్రెస్ నమ్మబలకలేకపోయింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సైతం ఒప్పుకుంది. బీజేపీకి పడింది తెరాస వ్యతిరేక ఓట్లే తప్ప బీజేపీకి వేయాలని వేసిన ఓట్లు కాదని అన్నారు కాంగ్రెస్ నేతలు.
మరి ఆ వ్యతిరేక ఓట్లను జనం తమకెందుకు వేయలేదు, కనీసం సెకండ్ ఆప్షన్ కింద కూడ పనికిరామని జనం ఎందుకు అనుకున్నారో మాత్రం కాంగ్రెస్ చెప్పట్లేదు. అదే ఆ పార్టీలో ఉన్న ప్రధాన లోపం. కేంద్ర స్థాయిలో బీజేపీకి మోడీ అనబడే స్థిరమైన లీడర్ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ అధ్యక్షురాలా లేకపోతే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్న రాహుల్ గాంధీనా అనేది క్లారిటీ లేదు. తెలంగాణలో సైతం పార్టీలో నాయకుల నడుమ కోల్డ్ వార్ నడుస్తోంది. అలాంటివారిని గెలిపించినా సొంత పార్టీ నేతలే వారికి అడ్డుపడతారు. అంతమాత్రం దానికి గెలిపించడం ఎందుకని వదిలేసి ఉంటారు. ఈ పొరపాట్లను ఇప్పటికైనా కాంగ్రెస్ విశ్లేషించుకుంటే మంచిది.