పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడే తండ్రికి సంతోషం అనేది పాత నానుడి. ఇప్పుడు ట్రెండ్ మారింది అన్ని రంగాలలోనూ మహిళలు తమ సత్తా చాటి చూపిస్తున్నారు. తల్లి దండ్రులకి గర్వకారణంగా నిలుస్తున్నారు. పుత్రుడే కాదు పుత్రికలు కూడా ప్రయోజకులు అయ్యి తండ్రికి ఎనలేని సంతోషాన్ని, కీర్తిని పెంచుతున్నారు. ఇప్పుడు ప్రగతి నివేదన సభలో ఒక తండ్రికి అలాంటి సంఘటనే ఎదురైంది. ఒక తండ్రి-కూతురి మధ్య అరుదైన, ముచ్చటైన ఘటన చోటు చేసుకుంది.
ఆగండి ఆగండి… తండ్రి కూతురు అనగానే సీఎం కెసిఆర్, ఎంపీ కవిత అనుకుంటారేమో కాదండోయ్… మేము చెప్పేది ఇద్దరు పోలీసు అధికారుల గురించి. కొంగర కలాన్ వద్ద జరుగుతున్న ప్రగతి నివేదన సభకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర రావు శర్మ, జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ సభా ప్రాంగణంలో డ్యూటీలో ఉన్నారు. వీరిద్దరూ తండ్రి కూతుళ్లు.
ఒకే వేదిక వద్ద ఉన్న వీరిద్దరి మధ్య ఒక ఆసక్తికర, అరుదైన ఘటన చోటు చేసుకుంది. తండ్రికి పై అధికారిణిగా ఉన్న సింధు శర్మ వేదిక వద్దకు రాగానే డీసీపీ ఉమామహేశ్వర శర్మ సెల్యూట్ చేశారు. ఈ ఘటన అందరి దృష్టిని ఆకట్టుకుంది. సాంస్కృతిక వేదిక, మహిళలకు కేటాయించిన గ్యాలరీలకు సింధూ శర్మ ఇంచార్జి డ్యూటీలో ఉన్నారు. కాగా ఉమా మహేశ్వర శర్మ సభా వేదిక వద్ద బందోబస్తు ఇంచార్జి గా వ్యవహరిస్తున్నారు. పోలీస్ డ్యూటీలో భాగంగా నాన్ క్యాడర్ ఎస్పీ ఉమామహేశ్వర శర్మ, ఐపీఎస్ ఆఫీసర్ అయిన కూతురు సింధూ శర్మకి సెల్యూట్ చేయటం చాలా అరుదుగా జరిగే ఘటన.
ఉమామహేశ్వర శర్మ ఎస్సైగా 1985 వ సంవత్సరంలో పోలీసు వ్యవస్థలో అడుగుపెట్టారు. అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు నాన్ క్యాడర్ ఎస్పీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. 2014 బ్యాచ్ ఐపీఎస్ గా సింధూ శర్మ ఎంపిక అయ్యారు. పెద్దపల్లిలో తొలి పోస్టింగ్ తెచ్చుకున్నారు. రీసెంట్ గా జగిత్యాల ఎస్పీగా బదిలీలో మారారు. వీరిద్దరూ ఇప్పుడు ప్రగతి నివేదన సభలో పోలీసు బందోబస్తు విధులకై ఒకే చోట హాజరయ్యారు.