కోమటిరెడ్డికి రాహుల్ గాంధీ గుడ్ న్యూస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగియక ముందే పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఇంకా కొలువుతీరనే లేదు అప్పుడే ఎంపీ ఎన్నికల హంగామా ప్రారంభమైంది. తెలంగాణలో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ నేతలు రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై కసరత్తు ప్రారంభించారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ప్రకటన హట్ టాపిక్ అయ్యింది.

నల్లగొండలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఏమన్నారో ఆయన మాట్లల్లోనే…

“తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని కార్యకర్తలు అదైర్యపడవద్దు. ఏ సమస్య వచ్చినా నేను ఆదుకుంటాను. నా జీవితం ప్రజలకే అంకితం. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సర్పంచ్ ఎన్నికలను కాంగ్రెస్ శ్రేణులంతా సవాల్ గా తీసుకొని పని చేయాలి. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఐదేళ్లలో పంచాయతీలకు తగినన్నీ నిధులు ఇవ్వలేదు. కేంద్రం పంపిన నిధులను వెనక్కు పంపారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. సవాల్ గా తీసుకొని పనిచేసి పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని విజయ ఢంకా మోగించాలి.  

తెలంగాణలో ఎన్నికలు పెట్టకుండా స్థానిక సంస్థలను నాశనం చేశారు. వారి అధికారం కోసం గ్రామాలను ఆగం చేశారు. ఈ తెలంగాణలో కేసీఆర్ ఆడిందే ఆట.. పాడిందే పాట అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన నోర్మూసుకోని కూర్చుంటాం అనుకోవడం కేసీఆర్ భ్రమ. ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతాం. ప్రజల పక్షాన నిలబడతాం.

కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకుంటానని ప్రకటించారు కాబట్టే నల్లగొండ ప్రజలు టిఆర్ఎస్ ను గెలిపించారు. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం నల్లగొండను దత్తత తీసుకొని అభివృద్ది చేయాలి. లేకపోతే ఎలా చేయించాలో అలా చేయిస్తాం.    

కార్యకర్తలు అదైర్య పడవద్దు. నేను 2019 ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా పోటి చేస్తున్నాను. రాహుల్ గాంధీకి ఈ విషయం చెప్పాను. రాహుల్ గాంధీ కూడా ఓకే అన్నారు. రాహుల్ గాంధీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక మన ఏర్పాట్లల్లో మనం ఉందాం. తెలంగాణలో తొలి ఎంపీ సీటు అభ్యర్ధిని కాంగ్రెస్ ప్రకటించినట్టే లెక్క. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోవడానికి సీట్ల సర్దుబాటు కూడా ఒక కారణమే. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తప్పు జరగకుండా చూస్తాం. ఇప్పటి నుంచే సీట్ల కేటాయింపు పై దృష్టి పెడుతాం. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచి మన సత్తాచాటుదాం. కార్యకర్తలు, నేతలు, ప్రజల సహకారంతో విజయం సాధిస్తాను.”   అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.   

కోమటి రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోను చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్ది కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నల్లగొండ ఎంపీగా పోటి చేసేందుకు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల పై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించిందని తెలుస్తోంది. 

రాజకీయాలలో సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ గా నిలిచే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో సారి చర్చనీయాంశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా అదైర్య పడకుండా ఎంపీ ఎన్నికల పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎపర్ట్ పెట్టడంతో కార్యకర్తలంతా ఆశ్యర్యపోతున్నారు. కోమటిరెడ్డి మనోదైర్యాన్ని వారు అభినందిస్తున్నారు.