అదానీకి సింగరేణి అమ్మకం… కేసీఆర్ పాత్ర కూడా ఉందా?

ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తున్నారనేది దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ పెద్దలపై ప్రజలకు పీకల మీద వరకూ ఉన్న ఆగ్రహం! ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో ఏపీ ప్రజలు బీజేపీపై ఫైరవుతున్నారు. ఈ సమయంలో తెలంగాణలో సింగరేణిని అదానీకి అమ్మాలని చూశారని… అందులో మోడీతో పాటు కేసీఆర్ పాత్ర కూడా ఉందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో విమర్శలు, ప్రతి విమర్శలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో… తెలంగాణ పర్యనటలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. బీఆరెస్స్, బీజేపీ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా… బీజేపీ, బీఆరెస్స్ ఒక్కటేనని అన్నారు. ఇదే సమయంలో… బీఆరెస్స్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో… బీఆరెస్స్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా… కేసీఆర్, మోడీ కలిసి సింగరేణిని అదానీకి అమ్మాలని చూశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ అడ్డుకుందని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులోనూ సింగరేణి ప్రైవేటు పరం కాకుండా కాపాడుతామని హామీ ఇస్తున్నట్లు రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.

ఇక, తెలంగాణ కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఒక రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడిన రాహుల్… కేసీఆర్ కుటుంబం ప్రభుత్వంలోని కీలక శాఖలను చూస్తుందని అన్నారు. కాళేశ్వరం వల్ల కాంట్రాక్టర్లను మాత్రమే మేలు జరిగిందని, ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములు లాక్కున్నారని, భూములు రికార్డులను మార్చి పేదలను ముంచారని రాహుల్ ఆరోపించారు. ఇదే సమయంలో… భూస్వాములకు మాత్రమే ఈ రైతుబంధు ఉపయోగపడిందని ఆయన విమర్శించారు.

మరోవైపు, దేశ వ్యాప్తంగా ఎంఐఎం ఎన్నికల్లో పాల్గొని బీజేపీకి మద్దతిస్తోందని ఆరోపించిన రాహుల్… బీజేపీపై తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కుల గణన చేయాల్సిన అవసరం ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇలా సింగరేణిని ప్రైవేటు పరం చేయాలని మోడీ – కేసీఆర్ లు కలిసే ఆలోచించారని రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారమే లేపాయి!