కొత్త వివాదంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన గతంలో బూతులు తిడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అప్పట్లో తుమ్మలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా మరో వివాదంలో ఆయన కూరుకుపోయారు. ఆ వివరాలు చదవండి.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వికలాంగుల సంఘాల ఐక్య వేదిక నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఒక వినతిపత్రం సమర్పించారు. అసలే వారంతా వికలాంగులు ఒకరు కాలు లేక, మరొకరు చేయి లేక అవస్థలు పడే వ్యక్తులు. అటువంటి వారితో వ్యవహరించాల్సిన పద్ధతిలో తుమ్మల వ్యవహరించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు వచ్చి వినతిపత్రం సమర్పించే సమయంలో తుమ్మల వారిని అవమానపరిచేలా కూర్చున్నారని విమర్శలు వస్తున్నాయి. వారు వచ్చినప్పుడు వారివైపు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని వారితో వినతిపత్రం తీసుకున్నారు తుమ్మల.

కాలు మీద కాలేసుకుని కూర్చుని వికలాంగుల నుంచి వినతిపత్రం తీసుకుంటున్న మంత్రి తుమ్మల

అంగవైకల్యం కలిగిన వ్యక్తులు వచ్చినప్పుడు వారి దగ్గరకు వెళ్లి వినతిపత్రం తీసుకుంటారు. కానీ తుమ్మల మాత్రం కూర్చుని ఉండి వారి ముఖం మీద కాలు ఉండేలా కాలు మీద కాలేసుకుని వినతిపత్రం తీసుకుంటూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారని, ఆయనకు మానవత్వం కూడా లేదని పిసిసి వికలాంగుల విభాగం ఛైర్మన్ ముత్తినేని వీరయ్య మండిపడుతున్నారు. గాంధీ భవన్ లో ఈ విషయమై ముత్తినేని వీరయ్య మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.  

వికలాంగుల పట్ల అవమాన కరంగా ప్రవర్తించిన మంత్రి తుమ్మల ను తక్షణమే మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. వికలాంగుల సంఘాల ఐక్య వేదిక ఆద్వర్యంలో తెలంగాణ లో వికలాంగుల పట్ల జరుగుతున్న వివక్ష పై , అన్యాయం పై సోమవారం మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళిన వికలాంగుల పట్ల మంత్రి ప్రవర్తించి న తీరు హేయనీయము , అనైతికం అన్నారు. 

కనీసం కూర్చోనమనకుండా , తనైన లేచి వినతి పత్రం స్వీకరించ కుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం , ఆ కాలు వికలాంగుల మొఖానికి చూపిస్తూ అహంకార ధర్పం ప్రదర్శిస్తూ, వెటకారంగా మాట్లాడుతూ వినతి పత్రం స్వీకరించడం సిగ్గుచేటు , సమాజం తలదించుకునేలా ఉందన్నారు .

తుమ్మల వికలంగులపై నీ దొరతనమా ? నీ దురహంకార మా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం మరచావా ? అని ప్రశ్నించారు. వికలాంగుల అంటే ఇంతటి చులకన భావనా ? అని విమర్శించారు. ఇంతటి సంస్కారహీనంగా ప్రవర్తించిన మనిషికి స్త్రీ , శిశు , వికలాంగుల , వయో వృద్ధుల శాఖకు మంత్రిగా చేయడం దుర్మార్గమన్నారు. తుమ్మల చేత కె సి ఆర్ క్షమాపణ చెప్పించాలి , లేదంటే మంత్రి ని పదవీ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.