పవన్ తప్పుమీద తప్పు చేస్తున్నారా… అసలు లక్ష్యం పక్కకి?

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చెప్పిన మాటాలకీ.. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలకీ ఏమాత్రం పొంతనలేదనే చర్చ రాజకీయవర్గాల్లో అత్యంత బలంగా నడుస్తుంది. ఈ క్రమంలో 2014లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చినప్పుడు ఈ మాటలు పెద్దగా వినిపించింది లేదు. కానీ… తదనంతరం జరుగుతున్న పరిణామాలు ఈ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

అసలే చీకటి గాండాంధకారం… చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అని పవన్ జనసేన పార్టీ పెట్టినప్పుడు చెప్పిన మాటలు. ఇవి పవన్ పై ఎనలేని నమ్మకాన్ని ఒక వర్గంలో తీసుకొచ్చాయి. 2014లో అలా జరిగిపోయింది. 2019లో శూన్యంకాని శూన్యమే మిగిలింది! అయినా పవన్ లో మార్పు రాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రజలు చాలా తెలివైన వారు.. మాటలో, చేతలో, పోరాటంలో సిన్సియారిటీని గమనిస్తుంటారు.

తమకోసం మాట్లాడుతున్న నాయకుడి మాటల్లో స్పష్టత, పోరాటంలో నిజాయితీ ప్రజలకు చాలా ముఖ్యం. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టైనప్పుడు ఆయన కోసం సిన్సియర్ గా వెళ్లి మద్దతు తెలిపారు పవన్. ఆ చర్యలో కొందరికి నిజాయితీ కనిపించింది! తీసుకున్న నిర్ణయం సరైనదే అని టీడీపీ శ్రేణులు భావించి ఉండొచ్చు! ఈ సమయంలో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో చేరారు. దీంతో పవన్ గ్రాఫ్ మైనస్ లలోకి వెళ్లిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును… తెలంగాణా ఎన్నికల్లో పోటీచేయాలని ఏ ముహూర్తంలో అనుకున్నారో కాని అప్పటినుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అన్నీ సమస్యలే చుట్టుముడుతున్నాయి. చివరి నిముషంలో కుదిరిన పొత్తులో బీజేపీ ఎనిమిది సీట్లను జనసేనకు కేటాయించింది. ఇప్పుడు ఈ ఎనిమిది సీట్లలో గెలుపు సంకటంగా మారిపోయిన పరిస్థితి. వీటిలో ప్రచారం చేయటం ఒకెత్తైతే, గెలుపు మరో ఎత్తుగా మారింది.

ఈ ఎన్నికల్లో తెలంగాణలో ఖమ్మం, మధిర, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, కోదాడ, కూకట్ పల్లి, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయబోతోంది. గ్రౌండ్ రియాలిటి ప్రకారమైతే జనసేన ఒక్క నియోజకవర్గంలో కూడా గెలిచే అవకాశం లేదు. ఎక్కడికక్కడ బీఆరెస్స్ – కాంగ్రెస్ మధ్య భీకర పోరు ఉందని అంటున్నారు. పైగా అలాంటి స్థానాలు జనసేనకు దక్కాయి! అలా అని బీజేపీ ఓటు బ్యాంక్ కూడా కలిస్తే ప్రయోజనం ఉంటుంది అనుకుందామంటే… వాస్తవాలు బీజేపీనేతలకెరుకే!

ఇపుడిదే పవన్ కు పెద్ద సమస్యగా మారింది. ఇంకా గట్టిగా మాట్లాడితే… గెలవటం సంగతి కాసేపు పక్కనపెడితే… అసలు డిపాజిట్లు అయినా దక్కకపోతే ఏమిటి పరిస్థితి అనేది మరో పెద్ద ప్రశ్న! కారణం… తెలంగాణలో డిపాజిట్ లు దక్కకపోతే ఆ ప్రభావం ఏపీలో రిఫ్లెక్స్ట్ అయ్యే ప్రమాదం ఉంది.

పోనీ పవన్ తీవ్రస్థాయిలో ప్రచారం చేసి ఈ 8 నియోజకవర్గాల్లో ఎన్నో కొన్ని గెలిచేలా చేస్తారు అనుకుందామంటే… పవన్ ప్రసంగంలో అంత పవర్ ఉండటం లేదు. ఏపీలో తప్పో ఒప్పో నిజమో అబద్దమో పవన్ బలంగా మాట్లాడతారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైరవుతారు. చెప్పులు చూపిస్తారు.. నిప్పులు కక్కుతారు! కానీ… తెలంగాణలో మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతారు. తాజాగా మోడీ సమక్షంలో చేసిన ప్రసంగమే దీనికి ఉదాహరణ.

ఇలా నొక్కులు నొక్కితే ప్రజలు లైట్ తీసుకుంటారు. కనీసం చప్పట్లు కొట్టేవారు కూడా కరువయ్యే పరిస్థితి వస్తుంది. అలా అని ధైర్యం చేయగలరా అంటే… పవన్ ఆ సాహసం చేయ్యలేరనే అనుకోవాలి. ఇన్ని సమస్యలు కొని తెచ్చుకోవడం చూస్తుంటే… తెలంగాణ ఎన్నికల్లో పోటీకి పవన్ అనవసరంగా ఒప్పుకున్నారా అనే మాటలు వినిపిస్తున్నాయి! డిశెంబర్ 3న ఈ మాటల్లో ఎంత వాస్తవం ఉందనేది తెలిసే అవకాశం ఉంది!