పసుపు బోర్డు కూడా ప్రత్యేక హోదా లాంటిదే.!

తెలంగాణకి పసుపు బోర్డుని మంజూరు చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అలాగే, కేంద్ర గిరిజన యూనివర్సిటీ కూడా.! ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రకటించిన వరాలతో బీజేపీ శ్రేణులు కూడా గట్టిగా హర్షం వ్యక్తం చేయలేని పరిస్థితి. ముఖ్య నేతలకైతే మోడీ భజన తప్పదు కదా, ఆ భజన చేస్తున్నారంతే.

పసుపు బోర్డు విషయమై ఎప్పటినుంచో పంచాయితీ నడుస్తోంది. బీజేపీ తెలంగాణ నేతలు, తెలంగాణ సమాజానికి ఇప్పటిదాకా సమాధానం చెప్పుకోలేకపోయాయి. ఇప్పటిదాకా ఓ యెత్తు.. ఇకపై ఇంకో యెత్తు. రోజుల వ్యవధిలో బోర్డు వస్తే సరి. లేదంటే, బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో మరింత దారుణంగా అభాసుపాలవుతుంది.

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కి 2014 ఎన్నికల సమయంలోనే ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అంతే. 2019 ఎన్నికల సమయంలో పోలవరం ప్రాజెక్టు ‘టీడీపీకి ఏటీఎంలా మారింది’ అని ఇదే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు.

ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు.. వీటిల్లానే పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ.. అన్న చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలోనే గట్టిగానే ఖర్చు చేసి జనాన్ని సమీకరించారు. ప్చ్.. అదంతా ఖర్చు దండగ వ్యవహారమై కూర్చుంది.

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన, పరోక్షంగా గులాబీ పార్టీకి కలిసొచ్చేలా చేసింది. ప్రధాని ప్రకటనల్ని వెటకారం చేస్తూ, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందా.? పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యిందా.? ఇదెలా నమ్ముతాం.? అంటూ భారత్ రాష్ట్ర సమితి నేతలు బీజేపీని నిలదీస్తున్నారు.