పంచాయతీ కార్యదర్శి ఫలితాల విడుదలకు ఆటంకం

తెలంగాణలో 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను అక్టోబర్ 30 వరకు విడుదల చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం కార్యదర్శి సీహెచ్. శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యం పై విచారించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలోని 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు 5,62,429 మంది దరఖాస్తు చేసుకోగా పేపర్ 1 కి 4,77,637 మంది హాజరయ్యారు. పేపర్ 2 కి 4,75,012 మంది హాజరయ్యారు. జెఎన్టీయూ యూనివర్సిటి  అక్టోబర్ 10న ఈ పరీక్షను నిర్వహించింది.

తెలంగాణ రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం అమలులోకి రావడంతో  కొత్త పంచాయతీలతో కలిపి దాదాపు 12,751 గ్రామాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం కార్యదర్శి ఉన్న గ్రామాలను మినహాయించి మిగిలిన వాటిలో కొత్త వారిని పంచాయతీ కార్యదర్శులుగా నియమించనున్నారు.

మరో వైపు పంచాయతీ కార్యదర్శి పరీక్ష నిర్వహించిన తీరు పై అభ్యర్దులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష క్వశ్చన్ పేపర్ ను తీసుకోవడం, ఓఎంఆర్  జీరాక్స్ కాపీ  ఇవ్వకపోవడం వంటి నిబంధనపై అభ్యర్దులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అభ్యర్దులకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునే వీలులేదని ఖచ్చితంగా నియామకాలలో మోసం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి అభ్యర్ది ఓఎంఆర్ ఆన్సర్  షీటు డిజిటల్ కాపీ అందుబాటులో ఉంచాలని అలాగే మార్కుల వివరాలు కూడా పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.