తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. గజ్వేల్ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టిఆర్ ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ నియోజకర్గం నుంచి ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ పై ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటి చేశారు. శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ సమక్షంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి టిఆర్ ఎస్ లో చేరనున్నారు. కేసీఆర్ తో బద్ద శత్రుత్వంగా వ్యవహరించిన ఒంటేరు ఆయన చేతుల మీదుగా టిఆర్ ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఖంగుతిన్నారు. నిన్న మొన్నటి వరకు సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసిన ఒంటేరు టిఆర్ఎస్ లో చేరడం అందరిని కంగుతినిపించిదన్నారు.
సీఎం కేసీఆర్ ను ఓడించడమే తన జీవిత లక్ష్యమని ప్రకటించిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి టిఆర్ ఎస్ లో చేరనుండడంతో తెలంగాణ రాజకీయాలలో మరో సంచలనానికి తెరలేపిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని, తనకు ప్రాణ హాని ఉందని ఒంటేరు ఎన్నికల సమయం లో సంచలన ఆరోపణలు చేశారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ఒంటేరు గట్ట ిటఫ్ ఫైట్ ఇచ్చారు. నువ్వా నేనా అనే విధంగా ఎన్నికలు జరిగాయి. ఒకనొక దశలో ఒంటేరు పోటి చూసి సీఎం కేసీఆర్ కూడా తన విజయం పై అనుమానాలు వ్యక్తం చేశారని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు అగ్గి మీద గుగ్గిలమైన నేతలు నేడు కలుసుకోనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఒంటేరు ప్రతాప్ రెడ్డి ముందు టిడిపిలో ఉన్నారు. టిడిపి నుంచి 2014లో సీఎం కేసీఆర్ పై పోటి చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పరిణామాలతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. గజ్వేల్ నుంచి కాంగ్రెస్ తరపున ఆయన ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటి చేశారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. ఎన్నికల సమయాన అర్దరాత్రి ఒంటేరు ఇంట్లో పోలీసుల దాడులతో ప్రజలంతా ఒంటేరుకు అనుకూలంగా నిలిచారు. చాలా భావోద్వేగపు మాటలతో ఆయన ప్రచారం నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఇక తనకు రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. కనీసం ఉండడానికి స్వంత ఇల్లు కూడా లేదని కిరాయి ఇంట్లో హైదరాబాద్ లో బతుకుతున్నానని పదే పదే సభలల్లో ప్రస్తావించారు. ఒంటేరుు స్పీచ్ విని చాలా గ్రామాలలో ప్రజలు, కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. ఒంటేరు ఈ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మనస్సును గెలుచుకున్నారన్న సానుభూతి వచ్చింది. కానీ ఒంటేరు తీసుకున్న నిర్ణయంతో అంతా షాక్ కు గురయ్యారు.
పార్టీ మార్పు పై గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలతో ఒంటేరు చర్చించారని తెలుస్తోంది. అందరి అభిప్రాయం తీసుకున్నాకే ఒంటేరు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సమక్షంలో శుక్రవారం పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్ ను గజ్వేల్ కు ఆహ్వానించి అభినందన సభ పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఒంటేరుకు ఎమ్మెల్సీ పదవిని టిఆర్ఎస్ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. లేనిచో ఉన్నతమైన నామినేటేడ్ పదవైనా దక్కనుందని తెలుస్తోంది. తన వ్యక్తిగత జీవితంతో పాటు రాజకీయ భవిష్యత్తు కోసమే ఒంటేరు టిఆర్ ఎస్ లో చేరుతున్నారని నేతల ద్వారా తెలుస్తోంది. ఒంటేరు పార్టీని వీడడం కాంగ్రెస్ కు ఒక షాక్ గానే చెప్పవచ్చని టిఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు.