TG: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆరు గ్యారెంటీలలో రైతు బంధు పథకం కూడా ఒకటి. అయితే గత ప్రభుత్వ హయామంలో కూడా రైతులకు పెట్టుబడి సాయంగా ఈ పథకం ద్వారా కొంత డబ్బును రైతుల ఖాతాలో జమ చేశారు. ఇలా కేసీఆర్ హయామంలో రైతులకు రైతుబంధు సహాయం అందజేయడంతో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త విమర్శలు చేసింది.
కెసిఆర్ హయామంలో పొలం ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ రైతుబంధు డబ్బులు జమ చేశారు వారు పొలంలో పంటలు వేస్తున్నారా ఆ పొలం వెంచర్లుగా మార్చారా అన్నది ఏవి చూడకుండా పొలం ఉన్న ప్రతి ఒక్క రైతుకు డబ్బులు జమ చేయడానికి కాంగ్రెస్ పూర్తిస్థాయిలో తప్పు పట్టింది. రైతుబంధు అనేది పంటలు పండించే రైతుకు సాయంగా అందించే డబ్బు అలాంటిది పంటలు వేయకుండా బీడు భూములకు అలాగే భూములను కమర్షియల్ పర్పస్ గా ఉపయోగించుకున్న వారికి ఈ రైతుబంధు పథకం ద్వారా డబ్బులు వేసి ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇక ఈ విషయంపై అప్పట్లో కేటీఆర్ కూడా స్పందించారు. ఈసారి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రైతుబంధు పథకంలో ఫిల్టర్ చేసి అర్హులైన వారికి మాత్రమే ఈ పథకం అందజేస్తామని తెలియజేశారు. కానీ ఈసారి ఎన్నికలలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతుబంధు పథకంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కేవలం పంటలు పండించే రైతులకు మాత్రమే ఈ రైతుబంధు సహాయం అందుతుందని ప్రకటించారు.
గతంలో ఇలా ఫిల్టర్ చేయడాన్ని సమర్థించిన పార్టీలు ఇప్పుడు తేడాగా స్పందిస్తున్నాయి. రైతు బంధును ఎగ్గొట్టడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు. రైతులు కాని వారికి.. పంటలు సాగు చేయని వారికి రైతుబంధు ఇచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ధైర్యంగా కౌంటర్ ఇవ్వలేకపోతోంది. ఇలా రైతుబంధు పథకం విషయంలో మరో సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. రైతుబంధు ఇస్తే ఓ రాజకీయం ఇవ్వకపోతే మరో రాజకీయం అనే విధంగా తెలంగాణ రాజకీయాలు కొనసాగుతున్నాయని తెలుస్తుంది.