రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలుస్తోంది తెలంగాణ. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆంధ్రాలో మూడే మూడు పార్టీలకు అసెంబ్లీ ప్రాతిధ్యం ఉంది. అధికార టిడిపి, ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు మొన్నటి వరకు అధికారంలో ఉన్న బిజెపి మూడో పార్టీ. కానీ తెలంగాణలో అలా కాదు. అధికార టిఆర్ఎస్ తో పాటు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీకి మిత్ర పక్షంగా ఎంఐఎం, ప్రతిపక్షంలో బిజెపి, టిడిపి, సిపిఎం, సిపిఐ, వైసిపి, ఉత్తరాదికి చెందిన బిఎస్పీ పార్టీల అభ్యర్థులు 2014 ఎన్నికల్లో గెలిచారు. ఆంధ్రాలో మూడే పార్టీలు అసెంబ్లీలో ఉంటే తెలంగాణలో మాత్రం 9 పార్టీలను ప్రజలు అసెంబ్లీకి పంపారు. అయితే బంగారు తెలంగాణ కోసం కావొచ్చు, మారిన రాజకీయ పరిణామాలు కావొచ్చు 9 పార్టీల ఉనికి ప్రస్తుతమైతే లేకుండాపోయింది. తొలినాళ్లలోనే బిఎస్పీ టిఆర్ఎస్ లో మెర్జ్ అయింది. తర్వాత వైసిపి మెర్జ్ అయింది. ఆ తర్వాత సిపిఐ కి ఉన్న ఒక ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరిపోయారు. టిడిపి ఎమ్మెల్యేలు లైన్ కట్టి మరీ టిఆర్ఎస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ నుంచి కూడా చేరారు. 2014 ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అసెంబ్లీలో టిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపి, ఎంఐఎం, బిజెపి, సిపిఎం పార్టీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మూడు పార్టీల ఉనికి గల్లంతయింది.
ఈ పరిణామాలు చూస్తే తెలంగాణలో ప్రజలు ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క నాయకుడికో కాకుండా అన్ని పార్టీలను ఆదరించే వాతావరణం ఉంది. పార్టీ, ఆ పార్టీ నాయకుడి శక్తి సామర్థ్యాలను చూసి ఆదరించే వాతావరణం తెలంగాణలో ఉంది. ఈ పరిస్థితుల్లోనే తాజాగా తెలంగాణ తెర మీదకు మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతున్నది. అతి తొందరలోనే తెలంగాణ యువత కోసం పనిచేసే పార్టీ ఆవిర్భవించనుంది. ఇప్పటికే తెలంగాణలో జెఎసి ఛైర్మన్ గా ఉన్న కోదండరాం తెలంగాణ జన సమితి పేరుతో కొత్త రాజకీయ పార్టీ స్థాపించారు. రేపో మాపో ప్రజా కళాకారుడు గద్దర్ కూడా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయవచ్చని ప్రచారం ఉంది. అయితే తాజాగా యూత్ లక్ష్యంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు నల్లగొండ ఉమ్మడి జిల్లా నేత జిట్టా బాలక్రిష్ణారెడ్డి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన ఇప్పటికి రెండుసార్లు భువనగిరి సీటులో పోటీ చేసి ఓడిపోయారు. కానీ రెండుసార్లు కూడా ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు యూత్ రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా జిట్టా బాలక్రిష్ణారెడ్డి కసరత్తు చేస్తున్నారు.
జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 1992లో వివేకానంద యువజన సంఘం స్థాపించారు. తర్వాత 1997లో రంగారెడ్డి జిల్లా యువజన సంఘాల సమితిని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో రాష్ట్రంలోని యువజన సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి యువజన సంఘాల సమితి ని ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో జిట్టా వైసిపిలో చేరారు. ఎప్పుడైతే వైసిపి తెలంగాణకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుందో అప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతర కాలంలో 2010లో యువ తెలంగాణ అనే వేదికను ఏర్పాటు చేసి దాని ద్వారా తెలంగాణ కోసం తన వంతు పోరాటం జరిపారు. అప్పటినుంచి గత ఎనిమిదేళ్లుగా యువ తెలంగాణ తరుపున ఆయన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ డబ్బు చుట్టే తిరుగుతున్నాయి తప్ప యువతకు న్యాయం చేయడంలేదని జిట్టా ఆవేదన చెందుతున్నారు. అందుకోసమే యువ తెలంగాణ అనే సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. యువ తెలంగాణ పార్టీ త్వరలోనే తెలంగాణ తెర మీదకు రానుంది.
అయితే యువ తెలంగాణ పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణ జన సమితితో కలిసి పనిచేసే అవకాశాలున్నట్లు సమాచారం అందుతోంది. ఎందుకంటే తెలంగాణ జన సమితి పుట్టకముందు నుంచీ కూడా తెలంగాణ జెఎసి ఛైర్మన్ గా ఉన్న రోజుల్లో కోదండరాం యువత కోసమే ఎక్కువ పోరాటాలు చేశారు. యువతకు ఉద్యోగాలు, స్థానికులకే ఉద్యోగాల రిజర్వేషన్ వంటి అంశాలపై కోదండరాం పనిచేశారు. కొలువులకై కొట్లాట లాంటి సభలు పెట్టింది కూడా యవత కోసమే. రేపటి ఎన్నికల్లో జన సమితిలో యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు. స్థానిక సంస్థల్లో యూత్ ను ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో జన సమితి ఉన్నది. ఈ నేపథ్యంలో యువ తెలంగాణ పార్టీ ఏర్పాటైతే జెఎసితో కలిసి పని చేస్తామని జిట్టా సన్నిహితులు చెబుతున్నారు. వార్డు మెంబర్ మొదలుకొని ఎంపి సీటు వరకు యూత్ కే సీట్లు ఇచ్చేవిధంగా తాము ప్లాన్ చేస్తామని వారు చెప్పారు.
మొత్తానికి ఎన్ని రాజకీయ పార్టీలనైనా ఆదరించే మనసున్న తెలంగాణ ప్రజలు మరి రానున్న రోజుల్లో యువ తెలంగాణ పార్టీని ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. యువ తెలంగాణ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఒక పోస్టు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నది. ఆ పోస్టును జిట్టా అనుచరుడు పెట్టారు. దాన్ని కింద యదాతదంగా ఇస్తున్నాం. చదవండి.