షర్మిళకు రూల్స్.. కౌశిక్ రెడ్డికి వర్తించవా?

అధికారపార్టీ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె పాదయాత్రకున్న అనుమతులను రద్దు చేశారు! అనుచితవ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని సంకేతాలు పంపారు. అధికారపార్టీ నేతలపై చేస్తే అరెస్టులు.. మరి అధికారపార్టీ నేతలే ఇతరులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే…!

అవును… తెలంగాణలో గత కొంతకాలంగా ప్రభుత్వానికి – గవర్నర్ కు మధ్య గ్యాప్ ఉందని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. దీంతో స్థాయిమరిచిన కొంతమంది నేతలు.. గవర్నర్ అనే ఆలోచన లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. వారిలో కౌశిక్ రెడ్డి నాలుగు ఆకులు ఎక్కువ చదివారు! దీంతో… మహిళాకమిషన్ నోటీసులు పంపించింది!

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి.. గవర్నర్ తమిల సై పై ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ మొదలుపెట్టిన కౌశిక్… అసెంబ్లీ, కౌన్సిల్‌ లో పాస్ చేసిన‌ బిల్లులకు సంబంధించిన ఫైళ్లను గవర్నర్ ఇప్పటిదాకా తన దగ్గరే పెట్టుకున్నారు అంటూ అనుచిత పదజాలాలు వాడారు.

దీంతో బీజేపీ నేతలు ఫైరయ్యారు. నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అనంతరం జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ వివరణ కోరింది. ఫిబ్రవరి 21 తేదీ ఉదయం గం.11:30కు జరగనున్న విచారణకు స్వయంగా హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి నోటీసు పంపింది.

మరి వివరణ అనంతరం కౌశిక్ రెడ్డిపై సీరియస్ యాక్షన్ ఉంటుందా.. లేక, ఆయన వివరణకు జాతీయ మహిళా కమిషన్ సంతృప్తి వ్యక్తం చేస్తుందా అన్నది తెలియాలంటే వేచి చూడాలి!