Munugode By-Poll: మునుగోడు ఉప ఎన్నిక: వేరే లెవల్‌కి ‘ఓటుకు నోటు’.!

Munugode By-Poll: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిశాక ప్రలోభాల పర్వానికి తెరలేపింది. చివరి నిమిషం వరకూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తాయన్నది నిర్వివాదాంశం. సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా ఈ పంపకాలు తప్పవ్.!

మునుగోడులో ఓటు రేటు ఏకంగా 10 వేల పైన పలుకుతుందని కొన్నాళ్ళ క్రితం ఆయా రాజకీయ పార్టీలే రాజకీయ ఆరోపణలు పరస్పరం చేసుకున్న సంగతి తెలిసిందే. పది వేలు కాదు, నలభై వేలు.. అని ఓ పార్టీకి చెందిన నాయకుడు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. ఆ స్థాయిలో ఓటర్లను కొనేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయా.? అన్నది వేరే చర్చ.

కిలో మటన్ దగ్గర్నుంచి, సకుటుంబ సమేతంగా విహార యాత్రల వరకూ.. ఎన్నికల్లో గెలవడానికి ఓట్లనుు కొనేందుకు అన్ని మార్గాల్నీ రాజకీయ పార్టీలు ఆశ్రయిస్తూనే వున్నాయి. కాగా, 3 వేల నుంచి 5 వేలకు మించి ఇవ్వడంలేదంటూ కొందరు ఓటర్లు, ఆఫ్ ది రికార్డుగా రాజకీయ పార్టీల మీద మండిపడుతుండడం గమనార్హం.

‘మీరేమో పది వేలంటూ ప్రచారం చేశారు.. వాళ్ళేమో 20 వేల నుంచి 40 వేలన్నారు. ఎవరూ ఆ స్థాయిలో ఇవ్వడంలేదు..’ అని కొందరు ఓటర్లు వాపోతున్నారు. అంతేనా, ఆయా రాజకీయ పార్టీలకు శాపనార్థాలు కూడా పెట్టేస్తున్నారు ఓటర్లు.
అయినాగానీ, తెలంగాణ రాజకీయాల్లోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గంగా మునుగోడు రికార్డులకెక్కింది. ఎవరు గెలిచినాగానీ.. చివరికి ఓడిపోయేది ఓటరే.!