ఈనెల 6వ తేదీన ఉదయం 6గంటలకే కేబినెట్ సమావేశాన్ని కేసిఆర్ ఏర్పాటు చేశారు. కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సరిగ్గా ఉదయం 6గంటల 45 నిమిషాలకు అసెంబ్లీ రద్దు తీర్మానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ముందస్తు ఊహాగానాలు గత నెలరోజులుగా సాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు సిఎం కేసిఆర్ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. ప్రగతి నివేదన సభలోనూ ఆయన దీనిపై సస్పెన్స్ కొనసాగించారు. ప్రజలకు ఏది ఉపయోగకరం అయితే ఆ నిర్ణయమే తీసుకుంటామని ప్రకటించారు. కానీ ముందస్తు కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు కేసిఆర్. రాజ్యాంగపరంగా ముందస్తు ఎన్నికలకు వచ్చే చిక్కులు ఎలా ఉన్నాయి? ఏరంగా ముందుకు పోవాలన్నదానిపై చర్చోప చర్చలు జరిపారు.
మంగళవారం అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ అధికారులు, ప్రభుత్వ అధికారులు ముందస్తు పరిణామాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న అసెంబ్లీల రద్దు అంశాలపై స్టడీ చేశారు. న్యాయ నిపుణులతో చర్చించారు. అసెంబ్లీలకు ముందస్తు ఎన్నికలు వచ్చిన విషయంలో కోర్టు తీర్పులు ఎలా ఉన్నాయన్నదానిపై కూలంకషంగా చర్చించారు.
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అధికారుల వరుస బదిలీలు జరిగాయి. కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు చేపట్టారు. కిందిస్థాయి అధికారుల బదిలీలు కూడా జరిగాయి. రేపు సచివాలయంలో అధికారుల బదిలీలు కూడా జరిపే చాన్స్ ఉందని చెబుతున్నారు. పైకి ఏదీ ఓపెన్ గా చెప్పకపోయినా ముందస్తు కోసం సర్కారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నది.
ఇక కేసిఆర్ సెంటిమెంట్ మరోసారి ఇక్కడ తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. కేసిఆర్ అదృష్ట సంఖ్య 6 కాబట్టి ఈనెల 6వ తేదీన కేసిఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోబోతున్నారు. అంతేకాదు ఉదయం 6గంటల 45 నిమిషాలకు ఈ తీర్మానానికి కేబినెట్ లో ఆమోద ముద్ర వేయించుకునే పనిలో ఉన్నారు. అంటే (6+4+5 =15, 1+5 =6) ఇందులోనూ తన అదృష్ట సంఖ్య 6 వచ్చేలా కేసిఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వెంటనే కేబినెట్ నిర్ణయాన్ని సిఎం కేసిఆర్ గవర్నర్ నరసింహన్ కు నివేదించనున్నారు.
తెలంగాణ ఏర్పాటైన నాలుగున్నరేళ్ల కాలంలో ఏ కేబినెట్ సమావేశాన్ని కూడా ఉదయం 6గంటలకు జరిపిన దాఖలాలు లేవు. ఏ కేబినెట్ సమావేశం కూడా సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ జరిగాయి. కానీ అసెంబ్లీ రద్దు కోసం జరగనున్న సమావేశమే చివరి కేబినెట్ ఉదయం 6గంటలకే జరపతలపెట్టారని తెలుస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ సర్కారు కొలువుదీరిన సమయంలో తొలి కేబినెట్ సుదీర్ఘంగా సాగింది. రాత్రి 12గంటల వరకు కేబినెట్ సమావేశం జరిగింది. తర్వాత కాలంలో చాలా కేబినెట్ సమావేశాలు రాత్రివరకు సాగాయి.
ఈనెల 7వ తేదీన కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. 7వ తేదీన హుస్నాబాద్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు కేసిఆర్. కొంగరకలాన్ సభ ఫెయిల్ అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతుండడంతో క్షణాల మీద హుస్నాబాద్ సభకు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. హుస్నాబాద్ సభ నుంచే కేసిఆర్ ఎన్నికల ప్రచారం షురూ చేయవచ్చని అంటున్నారు. హుస్నాబాద్ మొదలుకొని 50 రోజుల్లో 100 సభలు కండక్ట్ చేస్తారని అంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ కేసిఆర్ కరీంనగర్ నుంచే ఎన్నికల ప్రచారం షురూ చేశారని ఆ సెంటిమెంట్ ఆయనకు వర్కవుట్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే ముందస్తు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారని చెబుతున్నారు.
అసెంబ్లీ రద్దు ముందస్తు ఎన్నికల హడావిడి తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అన్నీ అనుకున్నట్లు నడిస్తే డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రావొచ్చని అంటున్నారు.