టిఆర్ఎస్ ఒక ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ : ఎమ్మెల్సీ రాములు నాయక్

టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆ పార్టీ మీద, పార్టీ అధినేత కేసిఆర్ మీద నిప్పులు చెరిగారు. ప్రగతిభవన్ లో తెలంగాణ ద్రోహులకు చోటు కల్పిస్తున్నారని మండిప్డడారు. తెలంగాణ కేబినెట్ లో తెలంగాణవాదులను తరిమికొట్టిన వారికి అవకాశాలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ లో సెల్ఫ్ రెస్పెక్ట్ లేదన్నారు. టిఆర్ఎస్ పార్టీ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీగా మారిందని ధ్వజమెత్తారు. తన సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ రాములు నాయక్ టిఆర్ఎస్ కు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో రాములు నాయక్ ఏమన్నారో కింద చదవండి. 

ప్రెస్ మీట్ లో కంటతడి పెట్టిన రాములు నాయక్

తెలంగాణ రాగానే వెంటనే గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు? ఏమైంది? అనేక సందర్భాల్లో డిఎస్సీ పెట్టండి అని నేను కోరినాము. అయినా డిఎస్సీ పెట్టలేదు. ఏజెన్సీ ఏరియాల్లో బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని కోరినా భర్తీ చేయలేదు. ఆరోజు ఎన్టీఆర్ సిఎంగా ఉన్నప్పుడు బ్యాక్ లాక్ పోస్టులతోపాటు తొమ్మిది, పదో తరగతి పాసైన వేలాది మంది గిరిజనులకు ఉద్యోగాలిచ్చిన ఘనత ఆయనకు దక్కుతది. మీరు కనీసం బ్యాక్ లాక్ పోస్టులపైనా భర్తీ చేయండి మీకు కూడా మంచి పేరొస్తదని నేను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. 

దళితులకు మూడెకరాల భూమి అన్నారు? ఏమైంది? దళితులకు ఇచ్చినట్లుగానే పేద గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు అదేమైంది? తెలంగాణ రాగానే గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాతామని కేసిఆర్ వందల సభల్లో చెప్పిండు. మరి ఇప్పటి వరకు ఎందుకు రిజర్వేషన్లు గిరిజనులకు ఇవ్వలేదు. గిరిజనులు అంటే మీకు అంత చిన్నచూపా?

డి శ్రీనివాస్ ను సస్పెండ్ చేయమని జిల్లా మంత్రి, ఎంపి, ఎమ్మెల్యేలు,  నాయకులు అంతా సిఫార్సు చేసినా ఆయనను సస్పెండ్ చేయలేదు. వరంగల్ నాయకురాలు కొండా సురేఖను సస్పెండ్ చేయలేదు. కానీ నన్నే ఎందుకు సస్పెండ్ చేశారు? నేను లంబాడీని ఉన్నందుకే నన్ను సస్పెండ్ చేశారా?  20 సంవత్సరాలు నీ ఎంట ఉన్నాను. నాకు ఇదేనా బహుమతి.

రిజర్వేషన్లు గురించి, తెలంగాణ గురించి మాట్లాడితే, గిరిజనుల హక్కుల గురించి మాట్లాడితే, సింగరేణిలో బ్యాక్ లాక్ పోస్టుల భర్తీ గురించి మాట్లాడితే నన్ను భయపెట్టిన మాట వాస్తవమా కాదా? ప్రతిపక్ష నాయకుడివా? సొంత పార్టీ నాయకుడివా అంటూ నన్ను భయపెట్టలేదా? 

నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలొచ్చాయన్నారు. కానీ మరి నాకు ఏమైనా షోకాజ్ నోటీసులు ఇచ్చారా? వివరణ అడిగారా? నాతో మాట్లాడి 15 నిమిషాల్లో సస్పెండ్ చేయడం ఒక్క రాములు నాయక్ కే కాదు యావత్ గిరిజనులకు జరిగిన అవమానమే. రానున్న ఎన్నికల్లో మీకు గిరిజన తండాల్లో తప్పక గుణపాఠం జరుగుతుంది.

 

20 ఏండ్లు మీ వెంట ఉన్నందుకు సస్పెండ్ చేసి నాకు బహుమానం ఇచ్చిర్రా? గిరిజన పూజారులకు దీపదూప నైవేధ్యం వర్తింపజేయండి అని చెప్పినందుకు నన్ను సస్పెండ్ చేసిర్రా?  సమైక్య రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు సరిపోను లేవు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు? మరి రిజర్వేషన్లు పెంచలేకపోయారు కదా? వాటిని పెంచాలని అడిగినందుకు నన్ను సస్పెండ్ చేశారా? 

ట్రైబల్ ఇండ్రస్టియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పెడతామన్న మాటలు ఎక్కడ పోయినయి. గిరిజన బిడ్డలను టాటా బిర్లా చేస్తామన్న మాటలు ఎక్కడ పోయినాయి. గిరిజనులు అంటే మీకు ఎందుకు అంత చిన్నచూపు?

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి గిరిజన తండాలో తాగునీరు ఇస్తామని అన్నారు.  ఈ నాలుగేళ్లలో తాండాలలో తాగడానికి ఇంటి ఇంటికి నీళ్లు ఇస్తామన్నారు. ఎక్కడా ఇవ్వలేని విషయం వాస్తవం కాదా? ఆగస్టు 14వ తేదీన ఇంటింటికీ నల్లా నీళ్లు ఇయ్యకపోతే ఓట్లు అడగం అన్నారు. కదా? మరి ఏ ఆగస్టు 14వ తేదీనో నాకైతే అర్థం కావడంలేదు.

తెలంగాణ వస్తే ఇంటి ఇంటికి ఉద్యోగం వస్తది అన్నారు. రిజర్వేషన్లు పెరిగితే ప్రతి గిరిజన కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తదని చెప్పిన మాట వాస్తవమా కాదా? తెలంగాణ  రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టీ అధికారులు మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ లలో జాయింట్ కలెక్టర్లుగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజన అధికారులు ఎక్కడున్నరో అర్థం కావడంలేదు. గిరిజనులంటే ఈ ప్రభుత్వానికి ఇంత చులకన ఎందుకు?

ప్లెయిన్ ఏరియాల్లో ఐటిడిఎలు పెడతామన్నారు. మరి ప్లెయిన్ ఏరియాల్లో ఎందుకు ఐటిడిఎ ఏర్పాటు చేయలేదని నేను అడుగుతున్నాను. అనేక సందర్భాల్లో డిఎస్సీ పెట్టాలని అడిగినా పెట్టలేదు. ఎజెన్సీ ఏరియాల్లో బ్యాక్ లాక్ పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని ప్రాధేయపడ్డాను. కానీ జరగలేదు. 

తెలంగాణ భవన్ లో కట్టిన ప్రతి రాయి చెబుతది రాములు నాయక్ తెలంగాణ ద్రోహినా కాదా అన్నది. తెలంగాణ వాదులు ఎవరో తెలంగాణ ద్రోహులు ఎవరో కూడా తెలంగాణ భవన్ లోని ప్రతి రాయి చెబుతది.  ధర్నా చౌక తీయొద్దు. అక్కడే ఉంచండి. ఎస్టీ ఎస్టీ వాళ్లు , బాధిత బీద బిక్కి ప్రజలు ధర్నాలు చేస్తారు అంటే సస్పెండ్ చేశారా?

టిఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. టిఆర్ఎస్ ఒక ప్రయివేటు లిమిడెట్ కంపెనీ మాదిరిగా మారింది. ప్రగతి భవన్ లో తెలంగాణ ద్రోహులు నిండిపోయారు. ఆ ద్రోహులు ఇవాళ కేబినెట్ లో ఉన్నారు. తెలంగాణవాదులను తరిమికొట్టిన వ్యక్తి మీ కేబినెట్ లో ఉంటారు. ఆయన ఇంటికి పోయి డిన్నర్లు, లంచ్ లు చేస్తారు. అటువంటి వ్యక్తిని కారులో తిప్పుకుంటారు.

 

 

2009లో మహా కూటమి ఓటమి జరిగినప్పుడు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఇంట్లో ఉన్నాడు కేసిఆర్. అప్పుడు నిన్ను సైంటిస్ట్ గా పోల్చాను. 2004లో ఒక రాకెట్ తయారు చేశాము. అది బంగాళాఖాతంలో పడిపోయింది, తర్వాత 2009లో మరో రాకెట్ ప్రయోగించాము అది కూడా ఫెయిల్ అయింది అయినంత మాత్రాన సైంటిస్టును తప్పు పడదామా ? అని నేను అన్నాను. అప్పుడు కేసిఆర్ ను అందరూ తిడుతుంటే నేను అండగా ఉన్నందుకు ఇవాళ నన్ను సస్పెండ్ చేస్తరా? అంటూ రాములు నాయక్ నిప్పులు చెరిగారు.

మాటల సందర్భంలో మీడియా సమావేశంలోనే రాములు నాయక్ కంటతడి పెట్టారు.