సాయంత్రం ఏడు గంటల సమయం వరకూ ఆమె నివాసంలో డిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ప్రశ్నించారు.
‘సాక్షిగానే పిలిచారు..’ అని తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి అయ్యింది లెండి) నేతలు చెప్పినా, ఏడు గంటలకు పైగానే ఆమెను సీబీఐ ప్రశ్నించిన దరిమిలా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటి.? అన్నదానిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.
లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఇప్పటికే సీబీఐ, ఈడీలకు చిక్కిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ, ఎమ్మెల్సీ కవితను విచారించింది. కవిత కొన్ని మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారనీ, కొన్ని సిమ్ కార్డులూ మార్చారనీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలున్నాయి.
ఇంతకీ, ఆ ఆరోపణల్లో నిజమెంత.? విచారణ తర్వాత సీబీఐ ఈ విషయమై ప్రకటన చేయడానికి కొంత సమయం తీసుకునే అవకావం వుంది. న్యాయస్థానంలోనే ఆ వివరాల్ని సమర్పిస్తారు సీబీఐ అధికారులు. అయితే, కవిత మాత్రం మీడియా ముందుకొచ్చి, జరిగిన విచారణపై తాను చెప్పదలచుకున్నది చెప్పే అవకాశాలైతే లేకపోలేదు.
జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్న భయంతో, బీజేపీ కుట్రపూరితంగా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థల్ని తమపైకి ఉసిగొల్పుతోందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ‘మహా అయితే ఏం చేస్తారు, అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు.. అంతే కదా.?’ అంటూ ఈ కేసులో ఇప్పటికే తొందరపడి తీవ్రమైన వ్యాఖ్యలు చేసేశారు కవిత.
అయితే, ప్రస్తుతానికి సీబీఐ అధికారులు కేవలం విచారణతోనే సరిపెట్టారు. తదుపరి విచారణ వుంటుందా.? వేచి చూడాల్సిందే.