నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టిఆర్ఎస్ లో చేరడం ఖాయమైంది. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కు పెద్ద షాక్ తగిలినట్టయ్యింది. కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడే చిరుమర్తి లింగయ్య. లింగయ్య పార్టీ మార్పు పై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నారంటే…
“చిరుమర్తి లింగయ్య పార్టీ మారడం బాధాకరం. లింగయ్య ఇంత నమ్మక ద్రోహం చేస్తాడనుకోలేదు. నేను టివిలల్లో చూసే వరకు నాకు తెలియదు. మాకు తెలియకుండానే లింగయ్య పార్టీ మారాలని నిర్ణయించుకున్నాడు. మేం సంప్రదించినా అందుబాటులోకి రాలేదు. అసలు లింగయ్యను రాజకీయంలో ఇంత స్థితికి తీసుకొస్తే మాకు ఇంత అన్యాయం చేస్తాడా. అసలు నేను ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను. మూడు సార్లు టికెట్ ఇప్పించి రెండు సార్లు గెలిపించుకున్నాం.
మేం కూడా పార్టీ మారుతామని వార్తలు వస్తున్నాయి. గతంలో చెప్పినా… మరొసారి చెబుతున్నా… ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. మేం పార్టీ మారాలనుకుంటే టిఆర్ఎస్ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడే మారేవాళ్లం.. కానీ పదవులకు ఏనాడు ఆశ పడలేదు. మమ్ముల వ్యాపారపరంగా కూడా చాలా ఇబ్బందులు పెట్టారు అయినా భయపడలేదు.
లింగయ్యకు అప్పులున్నాయని ఆర్ధిక ఇబ్బందులు సెటిల్ చేసుకునేందుకే పార్టీ మారుతున్నారని కార్యకర్తలు చెప్పారు. అసలు నిజాలు ఏంటో త్వరలోనే తెలుస్తాయి. కానీ ఇది నిజంగా మాకు చాలా పెద్ద దెబ్బ. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు.” అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.