అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు తక్కువ చేసి చూపించకుండా,సరిగ్గా చూపించకుండా ఎలక్షన్ కమిషన్ ఈసారి పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు అభ్యర్థులు కార్యకర్తల భోజన ఖర్చుల నుంచి ప్రచార సామగ్రి వరకు ప్రతి దాని ధర తక్కువ చేసి చూపించేవారనే ఫిర్యాదులు రావడంతో… దీనికి చెక్ పెట్టడానికి ఈసీ సన్నద్ధమైంది. అందులో భాగంగా తెలంగాణ ఎన్నికల్లో దేనికి ఎంత రేటో ఫిక్స్ చేసి లిస్ట్ కూడా విడుదల చేసింది.
అవును… అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చులను లెక్కించడంపై ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా… బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చులు.. కార్యకర్తలకు కాఫీ, టిఫిన్, సమోసా, భోజనం, బిర్యానీల కోసం చేసే ఖర్చును సక్రమంగా చూపించేలా ధరల జాబితాను రూపొందించింది. ఆ లిస్టు ప్రకారమే అభ్యర్థి ఖర్చులను లెక్కకట్టాలని సూచించింది.
ఈ ధరల పట్టీని కూడా పట్టణాలకు, గ్రామాలకూ విడి విడిగా పేర్కొంది. ఇందులో భాగంగా.. సమోసా 10 రూపాయలు, వాటర్ బాటిల్ 20, టిఫిన్ 35, వెజిటబుల్ భోజనం 80, చికెన్ బిర్యానీ 140, మటన్ బిర్యానీ 180 ఇలా ధరలు నిర్ణయించారు. ఇదే సమయంలో బెలూన్లు, ఎల్ఈడీ స్క్రీనలకు, ఫంక్షన్ హాల్స్ లకూ కూడా ఈసీ ధరలు ఫిక్స్ చేసింది.
ఇందులో భాగంగా… ఒక్కో బెలూన్ కు రూ.4 వేలు, ఎల్‌ఈడీ స్క్రీన్ కు రూ.15 వేలను రోజు అద్దెగా అధికారులు పరిగణిస్తారు. ఇదే సమయంలో… ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహిస్తే పట్టణాల్లో అయినా, గ్రామాల్లో అయినా 15 వేల రూపాయలు అభ్యర్థి తన ఖర్చులో నమోదు చేయాలి. ఇదే సమయలో కుర్చీలు, టేబుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారుల పారితోషికం వివరాలూ స్పష్టంగా ఉండాలని ఈసీ స్పష్టం చేసింది.
2014లో ఎంపీ అభ్యర్థి వ్యయ పరిమితి గరిష్ఠంగా రూ.75 లక్షలు ఉండగా.. 2022లో ఆ మొత్తాన్ని రూ.90 లక్షలకు పెంచిన ఈసీ… ఇదే క్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయాన్ని రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది.
ఈసీ తన జాబితాలో పేర్కొన్న ధరల వివరాలు:
డీసీఎం వ్యాన్ రోజుకు – పట్టణాల్లో రూ.3000 – గ్రామాల్లో రూ. 3000
మినీ బస్సు రోజుకు – పట్టణాల్లో రూ.3500 – గ్రామాల్లో రూ. 3500
ఇన్నోవా కారు రోజుకు – పట్టణాల్లో రూ.4000 – గ్రామాల్లో రూ. 4000
పెద్ద బస్సు రోజుకు – పట్టణాల్లో రూ.6000 – గ్రామాల్లో రూ. 6000
బెలూన్ రోజుకు – పట్టణాల్లో రూ.4000 – గ్రామాల్లో రూ. 4000
డ్రోన్ కెమెరా రోజుకు – పట్టణాల్లో రూ.5000 – గ్రామాల్లో రూ. 5000
ఫంక్షన్ హాల్ రోజుకు – పట్టణాల్లో రూ.15000 – గ్రామాల్లో రూ. 12000
ఎల్ఈడీ స్క్రీన్ రోజుకు – పట్టణాల్లో రూ.15000 – గ్రామాల్లో రూ. 15000
టిఫిన్ ఒక పూట – పట్టణాల్లో రూ. 35 – గ్రామాల్లో రూ. 30
భోజనం ఒక పూట – పట్టణాల్లో రూ. 80 – గ్రామాల్లో రూ. 80
వెజిటబుల్ బిర్యానీ ఒక పూట- పట్టణాల్లో రూ. 80 – గ్రామాల్లో రూ. 70
చికెన్ బిర్యానీ ఒక పూట- పట్టణాల్లో రూ. 140 – గ్రామాల్లో రూ. 100
మటన్ బిర్యానీ ఒక పూట- పట్టణాల్లో రూ. 180 – గ్రామాల్లో రూ. 150