పిసిసి ఉత్తమ్ పై మర్రి శశిధర్ రెడ్డి ఫైర్

రాజకీయాల్లో రెండు రకాల పొలిటీషియన్లు ఉంటారు. గలీజు దందాలు చేస్తూ జనాలను కాల్చుకుతింటూ కోట్లు కూడబెట్టే రాజకీయ నాయకులు ఉంటారు. డీసెంట్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల సొమ్మ కోసం కక్కుర్తి పడకుండా వారికి సేవ చేసే వాళ్లు కొందరుంటారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్ రెడ్డి రెండో కోవలో నడిచే నాయకుడు. ఆయన ఎఐసిసి నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయనకు సీటు గల్లంతైంది. 

రాజకీయాల్లో ఇప్పటి వరకు ఎక్కడా శశిధర్ రెడ్డి మీద మచ్చలు లేవు. చందాల దందాలు చేసినట్లు ఆరోపణలు లేవు. సందు దొరికితే నోటికి పనిచెప్పి బూతుపురాణం వినిపించే టైప్ కాదు. అటువంటి క్రమశిక్షణ కలిగిన నాయకుడికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఉత్తమ్ స్కెచ్ తో మర్రి శశిధర్ డైలామాలో పడిపోయారు.

మర్రి శశిధర్ రెడ్డికి సనత్ నగర్ సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ హైకమాండ్ మొండి చేయి చూపింది. ఆ సీటును టిడిపికి కేటాయించింది కాంగ్రెస్. కూటమిలో భాగంగా కూన వెంకటేష్ గౌడ్ కు ఖరారు చేసింది. దీంతో మర్రి శశిధర్ రెడ్డి బాధపడ్డారు. తనకు సీటెందుకు రాలేదని ఆయన ఆవేదన చెందారు. తెలంగాణలో కేసిఆర్ సర్కారు చేస్తున్న అడ్డగోలు దందాలపై మర్రి శశిధర్ రెడ్డి నిత్యం న్యాయస్తానాల్లో పోరాటం చేస్తున్నారు. అటువంటి నాయకుడికి టికెట్ నిరాకరించడంతో ఆయన వర్గంలో ఆందోళన నెలకొంది. 

ఈ విషయమై శనివారం మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలకమైన ఆరోపణలు చేశారు. ఆయనేమన్నారో చదవండి. సనత్ నగర్ సీట్ టీడీపి అడుగుతున్నట్లు కుంతియా ఒకసారి నాతో అన్నారు. గెలుపునకు అవకాశం ఉన్నచోట్ల ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వము అని స్వయంగా రహుల్ గాంధీయే చెప్పారు. పార్టీ కి త్యాగం చెయ్యాల్సి వచ్చినప్పుడు నేను వెనుకాడనని చెప్పాను. 

కానీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి తప్పుడు నివేదికల ఆధారంగా నిర్ణయం జరిగిపోయింది. తాను గెలవలేనని స్క్రీనింగ్ కమిటీ వద్ద ఉత్తమ్ చెప్పడం బాధాకరం. ఆ సర్వే ఆధారంగా తీసుకుని స్క్రీనింగ్ కమిటీ తో పాటు అధిష్టానాన్ని కూడా ఉత్తమ తప్పుదారి పట్టించారు. గెలుపు గుర్రం శశిధర్ రెడ్డి అని సర్వే లు చెబుతున్నాయి. కానీ నాకు సీటు రాలేదు. ఒక టివి ఛానెల్ నిర్వహించిన సర్వే లో 68% నాకు ఓట్లు వచ్చాయి.

సనత్ నగర్ స్థానానికి పోటీ పడలేదని టీడీపీ వాళ్లే చెప్పారు. సీనియర్ నేత సీట్ లేకుండా పోతే ఏమనుకోవాలి. నా సీటు విషయంలో కుట్రలు జరిగాయి. పదవులు గురించి నేను ఎప్పుడు ప్రాకులాడలేదు. డిల్లీ లోని రాహుల్ గాంధీ కార్యాలయముతో మాట్లాడినాను. పునఃపరిశీలించాలని కోరాను రెండు రోజుల తరువాత నిర్ణయం తీసుకుంటా. పోటీ చేయాలన్న ఆరాటం నాకు లేదు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. 

రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని మర్రి శశిధర్ రెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతున్నాయి. ఆయన పార్టీలోనే కొనసాగుతారా? లేదంటే వేరే పార్టీలోకి వెళ్లిపోతారా అన్నది తెలియరాలేదు. కానీ ఆయనకు టికెట్ రాకపోవడమేంటని కాంగ్రెస్ నేతలు కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు.