తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి పార్టీకి ఇచ్చే ప్రాధాన్యత ఎంత? ఆయన తలుచుకోవాలే కానీ.. పార్టీలో వచ్చే మార్పులు ఏమిటి? తాజాగా నిర్వహించాలని భావించిన తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షపదవి ఎంపికను జానా చేసిన ఒక్క ఫోన్ కాల్ తో అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. దీంతో.. రథసారధి పదవి తనకే సొంతమని ఫీలైన వారందరికి అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం సాకింగ్ గా మారినట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి రథసారధి పగ్గాలు అప్పజెప్పేందేకు పార్టీ అధినాయకత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. దీంతో.. వాతావరణం హాట్ హాట్ గా మారింది. సమర్థుడైన సారధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయని.. త్వరలోనే కొత్త అధినేత ఎంపిక చేస్తున్నట్లుగా ప్రచారం జోరందుకుంది. ఇదిలా ఉంటే.. పార్టీ కొత్త సారధి ఎంపిక చివర్లోకి వచ్చిన వేళ.. అకస్మాత్తుగా తెర మీదకు వచ్చారు జానారెడ్డి.
నేరుగా ఢిల్లీ అధినాయకత్వానికి ఫోన్ చేసిన ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త సారధిని ప్రకటిస్తే జరిగే నష్టం.. అదే ఎంపిక చేయకుంటే జరిగే లాభాన్ని వివరించిన చెప్పినట్లుగా తెలుస్తోంది. త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగే వేళలో.. కొత్త సారధిని ఎంపిక చేసుకుంటే తిప్పలు తప్పవన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. తత్త్త్వం బోధ పడిన పార్టీ.. కొత్త సారధి ఎంపికను ఆపేసింది.తాజా పరిణామంతో జానా రెడ్డికి అధినాయతక్వం వద్ద ఉన్న ఇమేజ్ ఎంతన్న విషయం రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకు బాగా అర్థమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.