టిఆర్ ఎస్ లో సంతోషంగా ఉంటున్నదెవరు?

పువ్వు వాడిపోతున్నపుడు రెక్కలు ఒకటొకటే రాలిపోతుంటాయి. ఎన్ని రెక్కలు రాలిపోయినా, కొన్ని రెక్కలు,పాపం, అతుక్కునే వాడిపోతుంటాయి. అవి పువ్వు వాడిపోకుండా కాపాడలేవు. టిఆర్ ఎస్ పరిస్థితి ఇపుడలాగే ఉంది. 2014 టిఆర్ ఎస్ పార్టీ సూదంటు రాయి. ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ అనే కాదు, ఖద్దరేసుకున్న ప్రతివాడిని టిఆర్ ఎస్ ఆకర్షించింది. ఒక్క దెబ్బతో 12 మంది ఎమ్మెల్యేలను కోల్పోయి టిడిపి ఖాళీ అయింది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఒక ఎంపిని కోల్పోయింది. ఆ ఉత్సాహంతోనే  ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలుగుదేశం పార్టీకి డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు.

ఇక ఎన్నికల ముందుకు కెసియార్ తీయటి మాటలు విని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ  పిసిసి  అధ్యక్షుడు కె కేశవరావు  టిఆర్ ఎస్ లోకి దూకేశారు. వెంటనే ఆయన్ని పార్టీ సెక్రెటరీ జనరల్ అని దేశంలో ఏ పార్టీలో కూడా లేని పోస్టు సృష్టించి గాల్లోకి వదిలేశారు. అయితే, ఆయన పీకనులిమి, స్వరపేటిక ను చిదిమి పార్టీలో చేర్చకున్నారు. నలభై యేళ్లు కంఠమే ఆధారంగా  రాజకీయాల్లో బతికిన కేశవరావు బొమ్మలాగా అయిపోయారు. సెక్రెటరీ జనరల్ హోదాలో ఆయన ఢిల్లీలో ఏదయిన చేద్దామనుకునే లోపే ముఖ్యమంత్రి కూతురు కవిత  లోక్ సభలోకి  ప్రవేశించారు. కేశవరావు ఎందుకు కొరగాని సీనియర్ నాయకుడయిపోయారు. ఎంపిలంతా డమ్మీలయిపోయారు. కవిత నాయకత్వంలో విజయవంతంగా పనిచేయడం మాత్రం నేర్చుకున్నారు. అక్కడా ఇక్కడాఎక్కడ చూసిన కవితమ్మే. ఇక కెకె అనబడే కేశవరావు చేస్తున్నదంతా ఒక్కటే, సీనియర్ నాయకుడి హోదాలో సభలో కేసియార్ పక్కన ఉచితాసీనుడయి, ఆయన ప్రసంగాన్నంతా  కక్కలేక మింగలేక వింటూ, తనకు ప్రసంగించే అవకాశం రాక, చిరునవ్వుతో స్పందిస్తూ లోలోపల కుమిలిపోతూ బయటికిరాలేక, టిఆర్ ఎస్ లో ఉండలేక కాలం వెల్లబుచ్చుతున్నారు. సెక్రెటరీ జనరల్ హోదా లో ఉండి ఫామిలీలో ఒక్క ఎమ్మెల్యే సీటు కావాలని అడిగే ధైర్యం కూడా ఆయన లేదట.నిన్న, మొన్న టిఆర్ ఎస్ కు  రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వరెడ్డి చెప్పిన దాని ప్రకారం కెసియార్  పింక్ పార్టీలో ఆయన ఎంత సిక్ అయిపోయారో అర్థమవుతుంది.

కొద్ది రోజుల కిందట మరొక నలుగుురు ఎంపిలు టిఆర్ఎస్ నుంచి బయటకొచ్చేందుకు సిద్దంగా ఉన్నారని తెలుగురాజ్యం రాసిన వార్తని విశ్వేశ్వరెడ్ది ధృవీకరించారు. విశ్వేశ్వరెడ్డి చాలా ఆసక్తి కరమయిన విషయం వెల్లడించారు. కరీంనగర్ ఎంపి, వెలమకులస్థుడు వినోద్ కుమార్ కూడా అసంతృప్తి తో ఉన్నారని  అర్థమొచ్చేలా విశ్వేశ్వరెడ్డి చెప్పారు. విశ్వేశ్వరెడ్డి రాజీనామా చేశాక, పోన్ చేసి అభినందనలు చెప్పారు. ఇలా రెబెల్ ఎంపికి అభినందనలు చెబితే అది లీకయితే, ప్రమాదం అని వినోద్ కు తెలియా? రెండుసార్లు ఎంపి అయిన వినోద్ అమాయకుడు కాదు. అనుభవజ్ఞుడు. అంతే కాదు, డీసెంట్ గా ఉండే ఎంపి. అలాంటి వ్యక్తి లీకయితే ప్ర మాదం అ ని తెలిసినా విశ్వేశ్వరెడ్డిని అభినందించారంటే ఏమనాలి? ఏదయియితే అదవుతుందనే తెగింపు వచ్చినట్లే కదా?

టిఆర్ ఎస్ కు రాజీనామా చేసిన ఎంపి అభినందించిన పింక్ పార్టీ ఎంపి వినోద్ కుమార్

విశ్వేశ్వ రెడ్డి చెప్పిన మరొక పేరు మహబూబ్ నగర్ ఎంపి జితేందర్ రెడ్డి.ఆయన చాలా రోజులుగా పార్టీలో పెద్దగా పాల్గొనడం లేదని మీడియాలో రాస్తున్నారు. జితేందర్ లోక్ సభలో పార్టీనేత. కవిత ముందర ఆయేనేపాటి. కుటుంబ పాలన ఉన్నచోట పార్టీ ఎంత ఇరుగ్గా ఉండి , ఉక్కబెడుతూంటే ఊపిరాడని పరిస్థితి వుంటుందో వేరే చెప్పాల్సిన ఉంటుంది.

జితేందర్ అసంతృప్తి వెల్ల గక్కినట్లు విశ్వేశ్వరరెడ్డి  స్వయంగా చెప్పారు. దీనిని శంకించాల్సిన పనిలేదు. ఎందుకంటే, విశ్వేశ్వరెడ్డి కూడా ఇలాగే అసంతృప్తిని రేవంత్ రెడ్డితో చెప్పుకున్నారు. ఆయన లీక్ చేశారు. తర్వాత విశ్వేశ్వరెడ్డి తీవ్రంగా ఖండించినా రేవంత్ కామ్ గా ఉన్నారు. తర్వాత ఏంజరిగిందో ఎనిమిది కోట్ల తెలుగు ప్రజలు వెండితెర మీద చూశారు.

మొత్తానికి  తెలంగాణ రాజకీయాల్లో రివర్స్ అస్మాసిన్ (ఆర్ వొ)మొదలయింది.2014 లో పోలో మని, నియోజకవర్గాల అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కెసియార్ తో కండువా కప్పించుకుని ఫోటో దిగిన కాంగ్రెస్ టిడిపి వారంతా పరిగెత్తుకుంటూ వెనక్కొస్తున్నారు. రాబోతున్నారు. కొంతమందిని కెసియార్ సస్పెండ్ చేస్తున్నారు. ఒకపుడు టిఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ఒక్క మాట్లాడినా ఏదో ఒక టి.జాక్ శాఖ వచ్చి ఇళ్ల దగ్గిర గొడవ చేేసేది. నానా యాగీ చేసేది. వాళ్లకి ఆంధ్ర ఏజంట్లని టాగ్ తగిలించేది.  ఇపుడావాతావరణం ఎక్కడా కనిపించలేదు. వూర్లలో టిఆర్ ఎస్ అభ్యర్థులను జనం నిలదీస్తున్నారు. ఒక వేళ ఈ జనం కాంగ్రెస్ మూకలే అనుకున్నా, ఈ నాలుగేళ్లలోకాంగ్రెస్ వాళ్లకి రూలింగ్ పార్టీ వాళ్లని నిలదీసేంత  శక్తి వచ్చిందంటే… ఆలోచించాల్సిందే. ఈ మధ్యనే రాజ్యసభకు వెళ్లిన ముఖ్యమంత్రి బంధువు సంతోష్ కుమార్ ఎంపిల కదలికల మీద, కార్యకలాపాల మీద నిఘా పెట్టడం కూడా ఎంపిలకు నచ్చడం లేదు.

మరొక ‘సంతోషం‘ రావు ,రాజ్యసభ ఎంపి

కాల్లో ముల్లును నాలుక తీస్తా, ముక్కు నేలకు రాసుకుంటా లాంటి  తెలంగాణావేశాన్ని రేకెత్తించే గొప్ప ఉపన్యాసాలు కెసియార్ ఇవ్వలేకపోతున్నారు. ఆయన  చెప్పే తెలంగాణ నుడికారాలు పాత బడిపోయాయి. ఇపుడు  తెలంగాణలో ఆయనకు రెండు భూతాలు కనబడుతున్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు, రెండు సోనియా గాంధీ.

అయితే, ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఆయనకు మూడోకన్నుంది.  దానిని తెరుస్తానన్నాడామధ్య.  అది తెరిస్తే ఏమవుతుందో వేచిచూాడాలి.  మూడో కన్ను తెరచి శత్రువులందరిని భస్మం చేస్తాడా..