రాజు దైవాంశ సంభూతుడు అనే పాలసీ రాచరిక పాలనలో ఉండేది. రాజు అనేవాడు దేవుడితో సమానం. రాజు ఏది చెబితే అదే శాసనం. రాజు మాట జవదాటితే మరణదండన. రాచరికంలో ఏండ్లతరబడి ఇదే పద్ధతి కొనసాగింది. రాజుల అకృత్యాలు భరించలేక అనేక దేశాల్లో విప్లవాలు వచ్చాయి. ప్రజలు తిరుగుబాటు చేసి రాజులను తరిమికొట్టారు. అనంతరం ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యం మనుగడలోకి వచ్చింది. తెలంగాణ భూభాగంలో రాజు దైంవాశ సంభూతుడు అనే పాలనా కాలం నైజాం పీరియడ్ లో అంతమైంది. నైజాం పాలనకు రైతాంగ సాయుధ పోరాటం ద్వారా జనాలు, సైనిక చర్య ద్వారా యూనియన్ గవర్నమెంట్ చరమగీతం పాడాయి.
కానీ తెలంగాణలో నాలుగున్నరేళ్ల పాటు సాగిన కేసిఆర్ పాలన ప్రజాస్వామ్య బద్ధంగానే సాగిందా? కేసిఆర్ పాలనలో రాచరికపు ఆనవాళ్లేమైనా దొర్లాయా? అనే అంశాలపై కేసిఆర్ పాలనా కాలంపై ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక డెక్కన్ క్రానికల్ సంచలన కథనం ప్రచురించింది. ఆ కథనంలో కేసిఆర్ ఎంతగా రహస్య పాలన చేశారో.. ఆయన పాలన ప్రజలకు అందనంత దూరంగా ఉందో గణాంకాలతో సహా వెలువరించారు. డిసి పత్రిక అందించిన సమాచారం ఆధారంగా మనం ఒకసారి ఆ వివరాలను విశ్లేషిద్దాం.
ప్రజాస్వామ్యం అని గొప్పగా చెప్పుకుంటున్న మనదేశంలో పాలకులుగా ఎన్నికైనవారు పాత మూస పద్ధతులనే ఇంకా ఫాలో అవుతున్నారనడానికి తెలంగాణలో జరిగిన నాలుగున్నరేళ్ల పాలన ఒక నిదర్శనం. 2014 కు ముందు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలన అంటే సచివాలయం కేంద్రంగా సాగింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడినుంచే పాలన సాగించారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వాస్తు దోషం కారణంగా పాలన సచివాలయం నుంచి ప్రగతిభవన్ కు మారింది. ప్రగతిభవన్ పాలన మారినప్పటి నుంచి గోప్యత పెరిగింది.
ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో మాత్రమే రహస్య జీవోలు వెల్లడించేవి ప్రభుత్వాలు. రహస్య జీవో అంటేనే చీకటి వ్యవహారాల తాలూకు నిర్ణయాలు అన్న విమర్శ ఉంది. ప్రతిపక్ష పార్టీలకు, ప్రజలకు, ప్రజా సంఘాలకు తెలియకుండా ఉండేందుకు రహస్య జీవోలు వెల్లడిస్తారు. రాత్రికి రాత్రే ప్రాజెక్టుల అంచనాల పెంపు లాంటి నిర్ణయాలు రహస్య జివోల ద్వారా జరిగిపోతుంటాయి.
రహస్య జీవోల పై విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో పారదర్శకత కోసం పాలక ప్రభుత్వాలు ప్రతి జిఓను ఆన్ లైన్ లో ఉంచడం షురూ చేశాయి. దీంతో ప్రజలకు పాలన గురించి తెలుసుకునే వెసులుబాటు వచ్చింది. ఆన్ లైన్ లో ఏ జీవో కావాలన్నా చూసి దాని సమాచారం తెలుసుకునే వెసులుబాటు జనాలకు కలిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మెజార్టీ జీవోలు రహస్యంగానే ఉంచబడుతున్నాయి. కారణాలేమైనా ఏ జిఓను కూడా ప్రభుత్వ వెబ్ సైట్ లో చోటు దక్కించుకోలేక చీకట్లో బంధీ అవుతున్న పరిస్థితి ఉంది.
టిఆర్ఎస్ సర్కారులోని కేటిఆర్ మంత్రిగా పనిచేసిన మున్సిపల్ శాఖలో 2017లో కనీసం ఒక్క జీవో కూడా ప్రజలకు అందుబాటులో ఉంచలేదు.
తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా పనిచేసిన రోడ్లు భవనాల శాఖలో కేవలం 8 జీఓలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచారు.
2016లో 9951 జీఓలను కేసిఆర్ సర్కారు రహస్య జీవోలుగా జనాలకు అందుబాటులో లేకుండా చేసింది.
ఇక 2017లో అయితే ఏకంగా 11918 జీఓలు రహస్యంగా ఉంచబడ్డాయి.
తెలంగాణ సర్కారు మనుగడలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 22వేల జీఓలను బహిర్గతపరచలేదు. ప్రజలకు అందుబాటులో లేవు. మొత్తంగా ప్రభుత్వం 42శాతం సమాచారాన్ని మాత్రమే జనాలకు అందించింది. మిగతా 58 శాతం నిర్ణయాల తాలూకు జీవోలన్నీ రహస్యంగా ఉంచబడ్డాయి.
2014లో సచివాలయంలో పాలన సాగిన రోజుల్లో కేసిఆర్ సర్కారు 10283 జిఓలు ఇచ్చింది. ఆ జీవోలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచారు.
2015లో 21702 జీఓలు ఇవ్వగా వాటిని కూడా మొత్తానికి మొత్తం బహిర్గతపరచి జనాలకు అందుబాటులో ఉంచారు.
2016లో 23115 జీఓలు ఇవ్వగా 13,164 జీఓలను బయటపెట్టి 9951 జీవోలు సీక్రెట్ గా ఉంచారు.
2017లో 20614 జీఓలు ఇవ్వగా 8696 జీవోలు బయటపెట్టి 11,918 జీవోలు రహస్యంగా ఉంచారు.
అంటే దీన్నిబట్టి కేసిఆర్ సచివాలయానికి దూరంగా ప్రగతి భవన్ నుంచి పాలన చేసిన రోజుల్లోనే రహస్య జీవోల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని తేటతెల్లం అయింది. సచివాలయానికి రాని సిఎం పాలన ఎంత రహస్యంగా ఉందో వివరాలతో సహా డిసి పత్రిక కథనంలో ప్రచురించారు. కొన్ని నిర్ణయాలు జరిగిపోయినా కోర్టులకు వెళ్లిన సందర్భంలో తప్ప బయటకు రాలేదు.
వాస్తు దోషం, సౌకర్యాల కొరత పేరుతో తెలంగాణ సిఎం కొత్త సచివాలయ నిర్మానానికి పూనుకున్నారు. కానీ ఆయనకు అడుగడుగునా అడ్డంకులు వచ్చాయి. దీంతో కొత్త సచివాలయం నిర్మాణం షురూ చేయలేదు. చేసేది లేక తన నివాస కేంద్రమైన ప్రగతి భవన్ నే పాలనా కేంద్రంగా మార్చేశారు. అక్కడి నుంచే పాలన సాగించారు. అయితే రహస్య జీఓలతో పాలన సాగించడం పట్ల ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.