కాంగ్రెస్ సీనియర్ నేత నిజామాబాద్ మాజీ ఎంపి మధు యాష్కీ 2019 ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ వచ్చింది. ఆయన నిజామాబాద్ లో కాకుండా భువనగిరి పార్లమెంటు సీటులో పోటీ చేస్తారని గత కొంతకాలంగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. తన సొంతూరు హయత్ నగర్ భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉండడంతోపాటు మధు యాష్కీ సామాజికవర్గం వారు ఎక్కువగా ఉండడంతో ఆయన భువనగిరి వైపు మళ్లే చాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు అన్నాయి. అయితే ఆ ప్రచారాన్ని మధు యాష్కీ ఖండించారు. ఢిల్లీలో ఆయన తెలుగురాజ్యం ప్రతినిధితో మాట్లాడుతూ తాను రానున్న ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తానన్నదానిపై స్పష్టత ఇచ్చారు.
2019 ఎన్నికల్లో నిజామాబాద్ లోనే పోటీ చేసి తీరుతానని మధు యాష్కీ గౌడ్ తేల్చి చెప్పారు. తాను ఎంపీగానే పోటీ చేస్తానని తన ప్రత్యర్థులుగా ఎవరున్నా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బలమైన నేతగా ఉన్న వైఎస్ కాలంలోనే తాను కాంగ్రెస్ పార్టీలో జై తెలంగాణ నినాదం చేసిన వాడిని అంటూ ఆయన పేర్కొన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ భువనగిరి వెళ్లే చాన్సే లేదన్నారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాను ఈ విషయంలో ఇప్పటికే డిసైడ్ అయ్యానని కూడా స్పష్టం చేశారు. టిఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా రానున్న ఎన్నికల్లో తాను నిజామాబాద్ లో గెలిచి తీరుతానని తేల్చి చెప్పారు.
2014 ఎన్నికల తర్వాత నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో మధు యాష్కీ గౌడ్ అంటీముట్టనట్లుగా ఉన్నారన్న ప్రచారం ఉంది. ఆయన చుట్టపుచూపుగానే జిల్లాకు వస్తున్నారని ఎక్కువ సమయం ఢిల్లీ, హైదరాబాద్ రాజకీయాల్లోనే ఉన్నారన్న ప్రచారం ఉంది. మరి సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో ఆయన ఇకనుంచి నిజామాబాద్ జిల్లా రాజకీయాలపై కాన్ సన్ ట్రేట్ చేసే చాన్స్ ఉందని చెబుతున్నారు. రెండు పర్యాయాలు మధు యాష్కీ నిజామాబాద్ ఎంపిగా గెలుపొందారు. తర్వాత తెలంగాణ రావడం, టిఆర్ఎస్ గాలి వీయడంతోపాటు ఏకంగా కేసిఆర్ కుమార్తె నిజామాబాద్ ఎంపి సీటులో పోటీ చేయడంతో మధు యాష్కీ మూడో టర్మ్ లో ఓడిపోయారు. కానీ ఈసారి కవిత పోటీ చేసినా, ఆమె భర్త అనీల్ రావు నిజామాబాద్ లో బరిలోకి దిగినా తాను పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు.
టిఆర్ఎస్ గాలి 2014లో ఉన్నంతగా ఇప్పుడు ఏమాత్రం లేదని మధుయాష్కీ చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని అంటున్నారు. వ్యతిరేకతను అధిగమించి టిఆర్ఎస్ నిజామాబాద్ సీటు గెలుచుకోవడం అంత ఈజీ కాదని ఆయన భావిస్తున్నారు. బిజెపి నుంచి డి శ్రీనివాస్ కొడుకు ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తున్నప్పటికీ బిజెపి ఉనికి కూడా నిజామాబాద్ లో ఉండే చాన్సే లేదని మధు యాష్కీ వర్గం చెబుతోంది. అతి తొందర్లోనే మధు యాష్కీ నిజామాబాద్ పాలిటిక్స్ పై దృష్టి కేంద్రీకరిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి 2019 నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా సాగే చాన్స్ ఉందని చెబుతున్నారు.