షాకింగ్ న్యూస్.. టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మహిళా నేత

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామాల షాక్ తగులుతూనే ఉంది. ఇప్పటికే ఓ ఎంపీ, ఎమ్మెల్సీ, పలువురు కీలక నేతలు రాజీనామా చేశారు. ఖమ్మం జిల్లాలో మరో మహిళ నేత టిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.

భట్టి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్న ఉషారాణి, ఇతర మహిళా కార్యకర్తలు

మధిర పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షురాలిగా గూడెల్లి ఉషారాణి పని చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఆమె కీలకమైన నేతగా పని చేశారు. మహిళా విభాగాన్ని అభివృద్ది చేయడంలో ఉషారాణి కీలక పాత్ర పోషించారని కార్యకర్తలు తెలిపారు. కానీ పార్టీలో ఉషారాణికి సరైన గుర్తింపు దక్కలేదని వారు ఆరోపించారు. తన  రాజీనామా లేఖ పై ఉషారాణి స్పందించారు. ఆమె ఏం అన్నారో ఆమె మాటల్లోనే…

“టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేశాను. మహిళా విభాగాన్ని అభివృద్ది చేయడం కోసం అహర్నిశలు శ్రమించాను. అయినా కూడా పార్టీలో తగిన గుర్తింపు లేదు. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టిఆర్ఎస్ లో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదు. పార్టీలో ఎవరు పైరవీలు చేసుకుంటే వారికే కాంట్రాక్టులు, పదవులు దక్కుతాయి. నిజమైన కార్యకర్తలకు అసలు అవకాశాలు ఉండవు. టిఆర్ఎస్ లో కనిపించేది అంతా పైకి మాత్రమే. కానీ లోపల చాలా తతంగం ఉంది. అక్రమంగా నేతలు చాలా వసూళ్లు జరుపుతున్నారు. అధికారం అడ్డుపెట్టుకొని చాలా బెదిరింపులకు పాల్పడుతున్నారు.

మహిళా నేతలకు పార్టీలో సరైన గౌరవం లేదు. ఒక్క మహిళను కూడా కేసీఆర్ తన క్యాబినేట్ లోకి తీసుకోలేదు. స్థానికంగా కూడా టిఆర్ఎస్ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అన్నింటికి విసిగిపోయి పార్టీలో న్యాయం చేయలేకపోతున్నానన్న బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నాను. తెలంగాణ అంతటా విభేదాలు ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఎలా సాగాయో బయటికి కూడా అంతే విధిగా త్వరలో నేతలంతా బయటికి వెళుతారు. “ అని ఉషారాణి తెలిపారు.

టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఉషారాణి కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.  భట్టి విక్రమార్క ఉషారాణిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంధర్బంగా భట్టి మాట్లాడుతూ ఉషారాణికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ప్రకటించారు.

ఇటీవలే ఖమ్మం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడాన్ బేగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసినప్పుడే చాలా మంది నేతలు బయటికి వస్తారని ప్రకటించారు. ఆయన చెప్పినట్టే ఖమ్మంలో రోజుకో నేత పార్టీకి రాజీనామా చేసి బయటకి వస్తున్నారు. కీలకమైన నేతలంతా పార్టీని వీడుతుండడంతో టిఆర్ఎస్ ఖమ్మం నేతల్లో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది.