ఆపద్ధర్మ సిఎం కేసిఆర్ కు లీగల్ నోటీసులు

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ కు, ఆయన కేబినెట్ లో పనిచేసిన మంత్రులందరికీ లీగల్ నోటీసులు జారీ చేశారు తెలంగాణ న్యాయవాదులు. ఈ నోటీసులపై వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తామన్నారు. ఇంతకూ లీగల్ నోటీసుల కథ ఏమిటో వివరాలు చదవండి.

కేసిఆర్ కు అడ్వొకెట్ అరుణ్ కుమార్ పంపిన లీగల్ నోటీసు ఇదే
లీగల్ నోటీసు రెండో పేజీ

ఐదేళ్ల కోసం ఎన్నుకున్న అసెంబ్లీని ఏకపక్షంగా ఎందుకు రద్దు చేశారో కారణాలు చెప్పాలంటూ హైదరాబాద్ కు చెందిన న్యాయవాదులు అరుణ్ కుమార్, సోమ విద్యాసాగర్ లీగల్ నోటీసులు పంపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణలో ఓటరు నమోదు ప్రక్రియ జనవరి 1, 2019 వరకు ముగించాల్సి ఉన్నదని వారు తెలిపారు.

కానీ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బెంచ్ మార్క్ జనవరి 1,  2018కి కుదించాల్సి వచ్చిందని తెలిపారు. దీనిద్వారా సుమారు 20 లక్షల మంది యువతీ యువకులకు ఓటు వేసే హక్కు కోల్పోతున్నారని చెప్పారు. ముందస్తు లేకపోతే వారంతా ఓటర్లుగా నమోదై తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండేదన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అడ్వొకెట్ అరుణ్ కుమార్

రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పని చేస్తామన్నవారు ఇలా మధ్యలోనే అసెంబ్లీ రద్దు చేయడం సమంజసం కాదన్నారు. ఏ అడ్డంకులు వచ్చాయని అసెంబ్లీ రద్దుకు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కారణాలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు గవర్నర్ ఆగమేగాల మీద కేబినెట్ తీర్మానాన్ని సంతకం చేసి అసెంబ్లీని రద్దు చేయడానికి కారణమేంటో ప్రజలకు చెప్పాలన్నారు.

అంతేకాకుండా రాబోయే ప్రభుత్వం ఐదేళ్ల పాటు పక్కాగా నడుపుతారా లేదా? మధ్యలోనే ఇలాగే ఎన్నికలకు పోతారా? కూడా క్లారిటీ ఇవ్వాలని కోరారు. యంగ్ ఇండియా 2018 ఆధ్వర్యంలో వీరు ఈ నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందనను చూసి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఇప్పటికే ఒక న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ మంగళవారం (రేపు) విచారణకు రానున్నది. తాజాగా వీరు ఇచ్చిన లీగల్ నోటీసు కూడా చర్చనీయాంశమైంది.